Assembly Elections: డ్రైవర్‌ ఇంట్లో భారీగా దొరికిన నగదు

నవతెలంగాణ రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు ముమ్మరం చేసింది. భిలాయ్‌లోని ఓ డ్రైవర్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా నోట్ల కట్టలను ఈడీ గుర్తించింది. ఆ నగదు మొత్తం రూ.1.8కోట్లుగా పేర్కొంది. రాయ్‌పుర్‌లోని ఓ హోటల్‌లోని అతడి కారులో రూ.3.12 కోట్లు కలిపి మొత్తంగా రూ.5కోట్లును అధికారులు సీజ్‌ చేశరు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో వీటిని సరఫరా చేసేందుకు దుబాయ్‌ నుంచి వచ్చిన ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. యూఏఈ నుంచి వచ్చిన ఆసీం దాస్‌ అలియాస్‌ బప్పాను ఈడీ అధికారులు రాయ్‌పుర్‌లోని ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Betting app) ప్రమోటర్లు పంపించినట్టుగా భావిస్తున్నారు. ఇతడి వాహనంలో రూ.3.12కోట్లను సీజ్‌ చేశారు.
అదే సమయంలో భిలాయ్‌లోని ఓ రహస్య ప్రదేశంలో దాడి చేశారు. అతడి ఇంటికి తాళం ఉండటంతో వాటిని పగలగొట్టిన అధికారులు లోనికి ప్రవేశించారు. అనంతరం పరిశీలించగా బెడ్‌, బాత్‌రూమ్‌లలో భారీ సంఖ్యలో నోట్ల కట్టలు గుర్తించారు. వాటి విలువ రూ.1.8కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. మొత్తంగా ఈ రూ.5కోట్లు మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలకు చెందినదిగా అంచనాకు వచ్చారు. భిలాయ్‌కు చెందిన ఓ కౌన్సిలర్‌ వద్ద గతంలో ఇతడు డ్రైవర్‌గా పనిచేసినట్టు సమాచారం.  అధికారులు పలు బినామీ అకౌంట్లను గుర్తించినట్టు సమాచారం. వాటిలోని నగదు కలిపితే ఈ మొత్తం రూ.10కోట్ల వరకు ఉండనున్నట్లు అంచనా. ఇందులో కొందరు ప్రభుత్వ అధికారుల ఖాతాలు కూడా ఉండటం గమనార్హం.

Spread the love