కరాచీ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు..

నవతెలంగాణ – కరాచీ: పాకిస్థాన్‌లో అతిపెద్ద విమానాశ్రయం అయిన కరాచీ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. క్షతగాత్రులు అందరినీ అత్యవసర చికిత్స కోసం సమీపంలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భారీ పేలుడు తర్వాత మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లను చుట్టుముట్టాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ ప్రదేశంలో భారీ సైనిక బలగాలు మోహరించి ఉండడంతో వెంటనే ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. కాగా విదేశీ పౌరులపై జరిగిన దాడి ఇది అని సింధ్ రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పేలుడు చాలా పెద్దది కావడంతో విమానాశ్రయ భవనాలు కంపించాయని పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ అధికారి రాహత్ హుస్సేన్ వెల్లడించారు. సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారని పోలీసులు తెలిపారు.

Spread the love