వనస్థలిపురం పనామా కూడలి వద్ద భారీ అగ్నిప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్:​ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న వస్త్ర దుకాణం, ఫర్నీచర్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిర్వాహకులు దుకాణం మూసివేసి వెళ్లిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో వస్త్రాలు పూర్తిగా బుగ్గి పాలయ్యాయి. ఆనుకుని ఉన్న ఫర్నీచర్‌ గోదాంలోకి మంటలు విస్తరించడంతో.. ఫర్నీచర్‌ అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు, వాహనదారులు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. డీఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఐదు అగ్నిమాపక శకటాలతో సుమారు రెండున్నర గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో దుకాణంలో వస్త్రాలు, గోదాంలో ఫర్నీచర్‌ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Spread the love