నవతెలంగాణ – హైదరాబాద్: ఆమనగల్లు పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి దాటిన తర్వాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు మరింత వ్యాపించకుండా సమయానుకూలంగా చర్యలు తీసుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. గోదాములో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన సామగ్రి దగ్ధమైనట్లు సమాచారం. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.