– రూ.42 కోట్ల పెట్టుబడులకు వాల్ష్‌కర్రా హౌల్డింగ్స్ ఒప్పందం
– వచ్చే ఐదేండ్లలో స్టార్టప్‌ల్లో మరో రూ.839 కోట్ల పెట్టుబడి : సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హౌల్డింగ్స్ సంస్థ రాష్ట్రంలోని వీ-హబ్‌లో రూ.42 కోట్ల (ఐదు మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలాగే వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో నెలకొల్పే స్టార్టప్‌ల్లో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బృందం సమక్షంలో వాల్ష్‌కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల పరస్పరం ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను సీఎం అభినందించారు. వాల్ష్ కర్రా హౌల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పని చేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ లక్ష్యం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది. ఈ సందర్భంగా గ్రెగ్ వాల్ష్ మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి, నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపారు. ఫణి కర్రా మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయని వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు.