– గత ఏడాది రూ.10,669 కోట్లు 12 లక్షల దస్తావేజులు
– ప్రథమస్థానంలో రంగారెడ్డి జిల్లా
– ఆసిఫాబాద్‌లో అంతంతే
– అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు, ఓపెన్‌ప్లాట్లే సోర్స్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సర్కారుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వ్యవసాయేతర భూములు, స్థలాలు, ఇతరాల నుంచే అత్యధికంగా వస్తున్నది. ధరణి ప్రారంభించిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్థానిక రెవెన్యూ తహిసిల్దార్లకు అప్పగించిన నేపథ్యంలో అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యక్తిగత నివాస గృహాల రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయేతర స్థలాల దస్తావేజులను పరిశీలిస్తే రాష్ట్రం మొత్తంలో గత నాలుగేండ్లల్లో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. 2018-19 సంవత్సరంలో 15.08 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్(దస్తావేజు) చేయగా, రూ.5837 కోట్ల మేరకు ఆదాయం వచ్చినట్టు స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే 2022-23కు వచ్చేసరికి అటు ఆదాయం మరింత పెరిగింది. సుమారు 12 లక్షల డాక్యుమెంట్లకుగాను రూ.10,669 కోట్ల ఆదాయం సర్కారు ఖజానాలో జమ అయింది. కాగా 2021-22 సంవత్సరంలో కరోనా మూలంగా ఆదాయం సగానికి సగం తగ్గింది. 9,43,893 దస్తావేజులకుగాను రూ.4204 కోట్లు మాత్రమే రావడం గమనార్హం.
భౌతిక స్వరూపం
ప్రభుత్వానికి పలు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. అబ్కారీ శాఖ, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల నుంచి భారీగా ఆదాయం వస్తుంది. అందులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ప్రధానమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 రెవెన్యూ జిల్లాలు ఉంటే, రిజిస్ట్రేషన్ జిల్లాలు 12. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ సౌత్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
ఇకపోతే దాదాపు 144 సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఇటీవల పటాన్‌చెరు, రామగుండం, జయశంకర్ భూపాలపల్లిలోనూ సబ్‌రిజిష్ట్రార్ ఆఫీసులను అవసరాలరీత్యా తెరిచారు.
ఆదాయం ఇలా..
గత ఐదేండ్ల లెక్కలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం ముడుతున్నది.
దస్తావేజులు..ఆదాయం
సంవత్సరం దస్తావేజులు రుసుం(రూ.కోట్లల్లో)
2018-19 15,04,876 5,837
2019-20 1614417 6,241
2020-21 12,05,510 9,231
2021-22 94,38,93 4204
2022-23 1207060 10,669
జిల్లాల పరిస్థితి
ఆదాయం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే వస్తున్నది. 2023-24 తాజా సంవత్సరం లెక్కల ప్రకారం రంగారెడ్డిలో ఎక్కువ ఆదాయం వచ్చింది. రంగారెడ్డిలో ఇప్పటివరకు 1,18,072 డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయగా రూ.1961.80 కోట్లు ఆదాయం వచ్చి ప్రథమస్థానంలో ఉంది. అలాగే మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 83,742 డాక్యుమెంట్లకుగాను రూ.1200.75 కోట్లు, హైదరాబాద్‌లో 30,814కుగాను రూ.758.14 కోట్లు, సంగారెడ్డిలో 36,294 దస్తావేజులకుగాను రూ.419.65 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు తక్కువైనా, భూముల విలువలు భారీగా ఉన్న నేపథ్యంలో అదాయం అధికంగా వచ్చింది. ఇదిలావుండగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 1,398 డాక్యుమెంట్లకుగాను రూ.3.94 కోట్ల మేర ఆదాయం మాత్రమే సర్కారు ఖజానాలో జమ అయింది.