జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం

– అది అణు విస్పోటనం లాంటిది
– వెంటనే రద్దు చేయాలి
– కాంగ్రెస్‌ నేతృత్వంలో నిజ నిర్దారణ కమిటీ
– బీజేపీ నేతలు కేంద్ర సర్కారుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌
ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జీవో నెంబర్‌ 111 రద్దు చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ కుంభకోణం విలువను లెక్కించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అది అణువిస్పోటనం లాంటిదని ఆయన హెచ్చరించారు. హిరోషిమా,నాగసాకి లాగా హైదరాబాద్‌ను విధ్వంసం చేసేందుకు సోమేష్‌కుమార్‌, అర్వింద్‌కుమార్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ దుష్టచతుష్టయం కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిజ నిర్దారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యావరణ విధ్వంసానికి కారమవుతున్న ఈ జీవో ఎత్తివేతపై బీజేపీ నేతలు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌, వీ హనుమంతరావు, కోదండరెడ్డితో కలిసి రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. జీవో రద్దు నిర్ణయం వల్ల హైదరాబాద్‌ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక హైదరబాద్‌ విధ్వంసం మొదలైందనీ, కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియాను నడుపుతున్నారని విమర్శించారు. సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌ ఈ విధ్వంసానికి కారణమని ఆరోపించారు. ఆ నలుగురిని అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదన్నారు. జీవో పరిధిని పరిరక్షించేందుకు సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో నియమించిన కమిటీనే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేయాలంటూ నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించి ఈ నేపథ్యంలో తమ పార్టీ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పర్యావరణ వేత్తలతో చర్చించి ఒక సమగ్రమైన నివేదికను ఇస్తుందన్నారు. దాని ఆధారంగా భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఆ జీవోను జంటనగరాలకు మంచి నీటి సరఫరాకు సంబంధించిన చిన్న అంశంగా మాత్రమే చూపే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ తన ధన దహం తీర్చుకునేందుకే 111 జీవో రద్దు చేసి జంటనగరాలపై బాంబు వేశారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన భూ లావాదేవీలను బహిరంగ పర్చాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు నగరానికి కృష్ణా జలాలు పీజేఆర్‌ పోరాటం వల్ల వచ్చాయనీ, కాంగ్రెస్‌ హయాంలోనే గోదావరి జలాలు వచ్చాయని రేవంత్‌ గుర్తు చేశారు.అలాంటి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్లను విధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించారు. రూపాయి ఖర్చు లేకుండా పైపు లైన్లు వేశామన్న కేసీఆర్‌ ఇప్పుడు పైపుల కంపెనీల దగ్గర కమిషన్ల కోసమే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఆనాడు వచ్చిన భారీ వరదల వల్ల హైదరాబాద్‌కు తీవ్రమైన నష్టం జరిగిందనీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగా వరదల నివారణకు మూసీ ఉపనది ‘ఈసా’ పైన ఒక రిజర్వాయర్‌, మూసీ నదిపైన మరొక రిజర్వాయర్‌ నిర్మించాలని సూచించారని తెలిపారు. ఆ సూచనల ప్రకారం నిజాం ప్రభుత్వం1912లో ఉస్మాన్‌ సాగర్‌ నిర్మాణాన్ని ప్రారంభించి 1920లో పూర్తి చేసిందనీ, ఈసా నదిపై 1920లో హిమాయత్‌ సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభించి 1927లో పూర్తి చేసిందన్నారు. వీటి ద్వారా హైదరాబాద్‌ మహా నగరానికి నగరానికి కావాల్సిన నీళ్లను గ్రావిటీ ద్వారా ఏ ఖర్చూ లేకుండా సరఫరా చేయవచ్చునని తెలిపారు. కేవలం ఒకే ఒక్క కలం పోటుతో అటువంటి ప్రాధాన్యత ఉన్న జంట జలాశయాలను కేసీఆర్‌ సర్కారు మనుగడ లేకుండా చేసిందని విమర్శించారు. పది కి.మీ విస్తీర్ణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న ఉద్దేశంతో 1996 మార్చి 8న ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చిందనీ, కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హౌటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను తీసుకొచ్చిందని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో జంట జలాశయాల పరిరక్షణ అంశం సుప్రీంకోర్టుకు చేరిందన్నారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా జలాశయాలను పరిరక్షించడానికి 111 జీవోను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. జీవో పరిధిలో కేటీఆర్‌, కవిత, హారీశ్‌రావు, దామోదర్‌రావు, రంజిత్‌రెడ్డి వంటి నేతలకు ఫామ్‌ హౌజులున్నాయని రేవంత్‌ ఆరోపించారు. 2019 తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ భూములు కొనుగోలు చేశారనీ, ఫలితంగా ఆ ప్రాంతంలో 80 శాతం భూములు కేసీఆర్‌ బంధుగణం, ఆయన బినామీల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ఈ తతంగం ముగిసిన తర్వాత 111 జీవోను కేసీఆర్‌ రద్దు చేశారని ఆరోపించారు. బందిపోట్లను, దావూద్‌నైనా క్షమించవచ్చు…కానీ కేసీఆర్‌, కేటీఆర్‌ను క్షమించ కూడదని హెచ్చరించారు. కేసీఆర్‌ దోపిడీలో వాటా లేకపోతే కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బీజేపీ నేతలు బండి సంజరు, కిషన్‌రెడ్డిలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోకాపేటలో రూ. 600 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ. 40 కోట్లకే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట తమ పార్టీ కార్యాలయం కోసం కేసీఆర్‌ కేటాయించుకున్నారని రేవంత్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Spread the love