హ్యుమానిటీ

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560
సిగరెట్‌ ముట్టిచ్చుడు యిది ఇరవైవొకటోసారి. గడియారంల ప్రేమికులు రెండోపారి ముద్దుపెట్టుకుంటానికి దగ్గరికొస్తున్నరు. క్యాలెండర్ల తారీకు మారింది. తలుపు సబక్క సగం తెరిచే వుంది.
మనుషులు గాఢనిద్రల మునిగి తేలుతూ మొదటి కలను ముగించుకుని, రెండో కలకు తయారైతున్నరు. గీ సంధికాలంల మరో దమ్ము లాగాలనిపిచ్చిందతనికి.
లైటర్‌లో ఎల్తురు ఆరిపోయింది. అగ్గిపెట్టె కోసం దేవులాడుతాండు. కిచెన్‌ నుండి హాల్‌ దన్క సెర్చ్‌ ఇంజన్ల వెతికినట్టు వెతికి సూశిండు. గూగుల్‌ తల్లినడిగిండు. లాభం లేకుండా పోయింది.
మెరుపులాంటి ఆలోచన తట్టింది. వంట అర్రలకు పోయి పొయ్యి ముట్టిచ్చిండు. ఇగ సమస్య తీరిపోయినట్టే! అని అనుకున్నడు.
******
ఊపిరితిత్తుల నిండా పొగ నింపుకుని కొంత ధైర్నం అప్పుదెచ్చుకుని పదేపదే విన్న మాటలనే రివైండ్‌ చేసుకుని వింటున్నడు. వింటున్నప్పుడల్లా తల కొట్టేశినట్టు మొఖం ఏడ బెట్టుకోవాల్నో తెల్తలేదు. శాపనా ర్థాలేవో పెడుతున్నట్టు ఆలోచిస్తూ కలవరపడుతున్నడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఏవేవో పాటలు ప్లే అయితానయి.
ఒక్కకాడ నిలవడుతలేడు. అటీటు తిరిగి తిరిగి కాళ్ళు గుంజినట్టున్నై.. కుర్చీల కూలబడ్డడు. మల్లోపాలి గోడదిక్కు జూశిండు. ఆ ప్రేమికులు గంట ఎడబాటును సుత తట్టుకోలేకపోతున్నట్టె అనిపించింది. గడియగడియకూ రెట్టింపవుతున్న రెండు మనసుల విరహాన్ని కాలం అపురూపంగ రికార్డు జేత్తానట్టు అనిపించింది.
******
”గడియారం వంక సూత్తాంటె ఆ కోలమొఖమే యాదికొత్తాంది. చామనఛాయ రంగుతో, సొట్టబుగ్గలతో ఎంత ముద్దుగుండేది. ఆ సుల్కుమొఖం కండ్లడ్ల మెదులవట్టింది” తనలో తానే మాట్లాడుకోబట్టిండు.
మాయిల్నే రెండు జలపాతాలు దునికినై. అన్నా.. అని పిలిచినట్టు అలికిడైంది. తన గుండె కలుక్కుమన్నది. యింకింత దుక్కం తన్నుకొచ్చింది. కడసారి చూపుకు సుత నోసుకోలేదని ఒల్శెంత దుక్కం సుట్టుముట్టింది.
నోసుకోకుండ చేసినందుకు పట్టరాని కోపంతో ఊగిపోతున్నడు. తనను తాను సముదాయించుకునే స్థితి నుండి జారిపోతున్నడు. తన నుండి తాను విడిపోయి వందల, వేల, లక్షల రూపాల్లోకి మారి ఎదురు ప్రశ్నించుకుంటున్నడు.
అప్యాయంగా అన్నా అని పిలిచే చెల్లెలి చితి మంటల్ని ఊహించుకుంటున్నడు. తన నరాలు చిట్లిపోతున్నయి.
కండ్లు రెండూ అగ్నిగోళాలై మండుతున్నయి. తన దేహమే కాష్టమై కాలుతున్నట్టు శెప్పవశంగాని బాధను అనుభవిస్తున్నడు.
”అన్నా, మమ్ముల మర్చిపోయినవు గదా. ఫోన్‌ సుత జేత్తలెవ్వు, అంతగనం బిజీ అయినవా..” చెవుల్ల చెల్లె మాటలే వినబడుతాన్నై.
ఒక్క కడుపుల పుట్టకపోయినా నోరారా అన్నా అని పిలిచే పిలుపిప్పుడు లేదని నిలువూతా నీరై పోతున్నడు.
పెయ్యంతా వణుకుడు సురువైంది. లేచి నిలబడి కబోర్డ్‌ వైపు నడిచిండు. రెండు లార్జ్‌ పెగ్గులు కలిపి పెట్టుకుని, బైటికెల్లి రెండు దోసిళ్ళ నీటిని ముఖంపై చల్లుకుని వచ్చిండు.
ఒక్కడే కూసోని గ్లాసులోని మందును తదేకంగా చూస్తూ ఏవేవో ఆలోచిస్తున్నడు. కండ్లుమూసుకుని అతికష్టం మీద గొంతులో పోసుకున్నడు. తట్టుకుని తట్టుకుని కిందికి జారుతున్నట్టు చేతితో గొంతికను, ఛాతినీ తడుముకున్నడు. రెండు మాట్ల గొంతు సరాయించుకున్నడు.
బాధ దిగమింగలేక మద్యానికెందుకు అలవాటు పడుతరో రెండు పెగ్గులేస్తేగానీ అర్థంకాలేదతనికి. ఆ తరువాత బాటిల్‌ ఎలా ఖాళీ అయిందో తను పట్టించుకోలేదు.
”తాగితే బాధను మరిచిపోతరంటరుగని అది తప్పుడు ముచ్చట. మత్తు ఎక్కేది శరీరానికే గానీ మనసుకు కాదు. మనసుకు మత్తు ఎక్కించగల మందు దొరికితే బాగుండు” అని బిగ్గరగా అరుస్తున్నడు.
తాగినంక తనలోని తాత్వికుడు వేసే ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటున్నడు. మదిలో రకరకాల అనుమానాలు మొదలైనై. డిటెక్టివ్‌ లెక్క శోధించబట్టిండు.
ఆరోగ్యం బాగలేకనే చనిపోయిందని చెబుతున్నరు. ఎవలకు తెల్వకుండ రహస్యంగా దానం చేయాలనుకోవడంలోని మతలబు ఏమై వుంటుందని ఆరాతీయాలని నిశ్చయించుకున్నడు.
కనీసం తల్లిదండ్రులు, తోడబుట్టి నోళ్ళు కూడా దగ్గరికి రాలేదంటే ఏమనుకోవాలె? దొరికితే కడిగిపారేయాలనుకుంటున్నడు.
అయినవాళ్ళందరూ వున్నా అనాథలా ఈడ్చుకెళ్ళి కాటిమీద పెట్టిండ్లని విన్న మాటల్ని పదే పదే తల్సుకుంటున్నడు.
అగ్గిమీద గుగ్గిలమైతున్నడు. ఒక్కమాట సుత పెగలలేని, మరోమాట అడగాలనిపించని షాక్‌ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నడు.
******
ఎవరెవరికో ఫోన్‌ కలుపుతున్నడు. కొందరైతే లిఫ్ట్‌ చేయట్లేదు. అసహనంతో గదిలోని వస్తువుల్ని విసిరికొడుతున్నడు. ఒగలెన్క ఒగలకు ఫోన్‌ చేసి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం జేస్తున్నడు.
ఎవలూ చనిపోయిన ముచ్చటే తెల్వదంటున్నరు. మరింత రంది పట్టుకున్నది. అయినా తన ప్రయత్నం తాను చేస్తూనే వున్నడు.
చాలాసేపు రింగ్‌ అయిన తర్వాత అవుతలి మనిషి ఎత్తి మాట్లాడుతున్నట్టున్నది. సరిగా వినిపించకపోయేసరికి లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసిండు. అవుతలి మనిషి మాటలు స్పష్టంగా వినబడుతున్నై.
******
”పాడెగట్టినోల్లు లేరు. కుండబట్టినోల్లు లేరు” అని చెప్తాంటె తన కడుపు రగిలిపోతాంది. మరో రెండు పెగ్గులు వెంటవెంటనే తాగి గ్లాసు నేలకిసిరికొట్టిండు.
తలకొరివి పెడ్తానికి భర్త తరుపు వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? ఇటు కన్నవాళ్ళకూ అటు చేసుకున్నోడికీ ఎందుకు చేదైపోయిందో ఎంత ఆలోచించినా అంతుచిక్కట్లేదు.
”ఎంత ఆస్తి, ఎంత బలగం వుంటే ఏం లాభం? మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను గుంజుకపోయినట్టు మనిషిని సుత గుంజుకపోయి కాటిమీద పడేశిన్లు గదరా..” అని రొంబొచ్చె గుద్దుకుంట ఒక్కతీరుగ ఏడ్వబట్టిండు.
”ఎవలు ముందుకు రాకపోతే కాడుపేర్చిన మనిషే నిప్పుబెట్టిండు. ఏం జెప్పాలె నాన్నా.. కండ్లల్ల మెదులుతాందిరా బిడ్డా.. ఐదు నిమిషాలు అటీటు అయినా మేం సుత అందుకోపోదుంరా అయ్యా…” అని అవుతలి మనిషి ఏడ్సుకుంట చెబ్తాంటె వున్నకాన్నే కూలబడ్డడు.
సత్తువంతా కూడబలుక్కుని మాట్లాడవట్టిండు. శవాన్ని ఇంటిముంగటన్న ఏస్కోలేదని ఇన్నంక థూ.. ఏం బతుకైపోయిందిరా.. అని ఉచ్చగొట్టబట్టిండు.
బిడ్డసచ్చిందన్న బాధ లేకుంట తెల్లారెటాల్లకు కొడుకు పెండ్లిజేత్తనని ఎగిరే ఆడిదాన్ని తల్సుకుని మనిషి పుట్క ఎందుకు పుట్టినమా.. అనుకుంట పండ్లు పటపట కొరుకబట్టిండు.
బిడ్డను ముట్టుకుంటె ‘అంటు సుట్టుకుంటదని, మొగన్ని సుత బిడ్డను సూడనియ్యక గుంజుకచ్చిందని తెలిసి మానవసంబంధాలు ఇంకెక్కడున్నరా.. అని తల్కాయ గుద్దుకుంటున్నడు.
ఇగ ఏం మాట్లాడాలో తెల్వక అవుతలి మనిషి మాటలకు ఊ కొడుతున్నడు. అయినా కొన్ని ప్రశ్నలు ఇంకా వేధిస్తూనే వున్నై.
మూతలుపడుతున్న కండ్లను పెద్దవిజేస్తూ శూన్యంలోకి తొంగిసూత్తాండు. ఫోన్‌లో విన్నదంతా గిర్రున తిర్గవట్టింది. రాత్రంతా కన్నీళ్ళలోనే కరిగిపోయింది.
******
అలారం మోగిన సప్పుడుకు తెలివిలకొచ్చిండు. కండ్లు నులుముకుంటూ భారంగా గోడమీదికి చూపు సారించిండు. తెల్లారగట్ల ఐదయితాంది.
సుట్టుపక్కల సూత్తె గదినిండా కాల్చిన సిగరెట్‌ పీకలు, ఖాళీ అయిన మందుబాటిలు, ఒక మూలన తను అవుపడ్డడు.
ఇక ఎప్పటికీ నిద్రబట్టదని తీర్మానించుకుని ఫోన్‌ స్క్రోలింగ్‌ చేస్తూ మెసేజెస్‌ చూడవట్టిండు. వాట్సాప్‌లో పెళ్ళికారటు కంటవడ్డది.

Spread the love