వందలాది భారతీయులు పయనిస్తున్న

Hundreds of Indians are traveling– విమానాన్ని నిర్బంధించి విడుదల చేసిన ఫ్రాన్స్‌
ముంబయి : మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్న విమానం మంగళవారం ఉదయం ముంబయిలో ల్యాండ్‌ అయింది. 300మందితో పయనిస్తున్న ఒక చార్టర్‌ విమానాన్ని ఫ్రాన్స్‌ నాలుగు రోజుల పాటు ప్యారిస్‌ సమీపంలో నిర్బంధించారు. ప్యారిస్‌కు 150 కిలోమీటర్ల దూరంలోగల వట్రి విమానాశ్రయంలో గురువారంనాడు ఇందనం నింపుకోవటానికి దుబారు నుంచి వచ్చి ఆగిన ఎయిర్‌ బస్‌ ఏ-340 విమానాన్ని మానవ అక్రమ రవాణాకు గురవుతున్న వారు ఉన్నారని పేరు చెప్పని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు నిర్బంధించారు.
21నెలల పసిపాపతో సహా ప్రయాణీకులందరూ ఆ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మీడియా రిపోర్టులను అనుసరించి పెద్ద వాళ్ళ తోడులేని మైనర్లు 11మంది దాకా వున్నారు. వీరిని ప్రత్యేక సంరక్షణలో ఉంచారు. ఒక ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ గ్రూపు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదనే ఆరోపణపైన ఇద్దరు ప్రయాణీకులను నిర్బంధించినట్టు అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది.
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కార్మికులుగా పనిచేస్తున్న భారతీయులు అమెరికా, కెనడా దేశాలకు చేరటానికి ముందు నికరాగువా దాకా వెళుతున్నట్టుగా ఉందని ఓ వార్తాసంస్థ రాసింది. మానవ అక్రమ రవాణాను అరికట్టటానికి ప్రయత్నించని 17దేశాలలో నికరాగువా కూడా ఒకటని 2021లో అమెరికా వివిధ దేశాల పట్టికను విడుదల చేసింది.
విమానాశ్రయంలో నిర్బంధించబడిన భారతీయుల క్షేమం కోసం, సత్వరమే సమస్యను పరిష్కరించటం ద్వారా వారి విడుదల కోసం పనిచేస్తున్నామని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌(గతంలో ట్విట్టర్‌)లో ఒక పోస్టును పెట్టింది. విమానాన్ని ఫ్రాన్స్‌ ఎందుకు గ్రౌండ్‌ చేయవలసి వచ్చిందనే విషయంపైన, సదరు విమానం పయనించవలసిన మార్గాన్ని ఎందుకు మార్చవలసి వచ్చిందనే విషయంపైన భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ప్రయాణీకులను రెండు రోజులపాటు ప్రశ్నించి, విమానాశ్రయంలో అత్యవసర విచారణ జరిపి ఫ్రెంచ్‌ అధికారులు ఆదివారంనాడు విమానాన్ని విడుదల చేస్తున్నట్టుగా ఒక ప్రకటనలో తెలిపారు. అనేక విమానాలను నడుపుతున్న లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌ అనే రుమేనియన్‌ కంపెనీకి చెందిన విమానంలో ఈ భారతీయ ప్రయాణికులు పయనిస్తున్నారు.
మానవ అక్రమ రవాణాలో లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌కు ఎటువంటి సంబంధంలేదని ఆ సంస్థ అడ్వకేట్‌ లిలియానా బకాయోకో వాదించింది. ప్రయాణికుల డాక్యుమెంట్లను పరిశీలించే బాధ్యత తమ ‘భాగస్వామ్య’ కంపెనీదని, ఆ వివరాలన్నింటినీ విమానం బయలుదేరటానికి రెండు రోజుల ముందు లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌కు అందించటం జరిగిందని ఆమె అసోషియేటెడ్‌ ప్రెస్‌కు చెప్పింది. గతంలో కెనడా నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించటానికి ప్రయత్నించి విపరీతమైన చలి కారణంగా తమ కారులోనే మరణించిన ఒక భారతీయ కుటుంబం కూడా ఇలా జరిగిన అక్రమ రావాణా భాగమని, దాని వెనుక కింగ్‌ పిన్‌ గా అనుమానితుడైన శశి కిరణ్‌ రెడ్డి ఈ విమాన ఘటన వెనుక కూడా ఉండొచ్చని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక రిపోర్ట్‌ లో రాసింది. గత 15సంవత్సరాలుగా శశి కిరణ్‌ రెడ్డి మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

Spread the love