– కాంగ్రెస్‌లో పొన్నం, అలిగిరెడ్డి మధ్య సయోధ్య కుదిరేనా?
– టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ఒకేనంటూనే వేర్వేరుగా సన్నాహాలు
– పొత్తు కుదిరి సీపీఐకి అవకాశమిస్తే ఏంటని ‘హస్తం’ శ్రేణుల్లో అంతర్మథనం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎంపీ ప్రభాకర్‌తో ఇక్కడి ‘హస్తం’ పరిస్థితి రసకందాయకంగా మారింది. కొన్ని నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాలను చుట్టుముట్టిన ప్రవీణ్‌రెడ్డిని కాదని పొన్నం ప్రభాకర్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మెన్‌గా పొన్నంను నియమించడం, హుస్నాబాద్‌లో బీసీ ఓటర్లే ఎక్కువగా ఉండటం ఇందుకు అద్దం పడుతోంది. దాంతో టిక్కెట్ రానిపక్షంలో కాంగ్రెస్‌లోనే ఉండటమా? లేదా బీజేపీలో చేరి పోటీ చేయడమా? లేదంటే మళ్లీ బీఆర్‌ఎస్ గూటికి చేరి నామినేటెడ్ పోస్టు తీసుకోవడమా? అన్న ఆలోచనల్లో ప్రవీణ్‌రెడ్డి ఉన్నట్టు ఆయన అనుచరుల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు పొత్తు కుదిరి మళ్లీ సీపీఐకి అవకాశం ఇస్తే 2018 సీన్ రిపీట్ అవుతుందా? అన్న అంతర్మరథంలో ‘హస్తం’ శ్రేణులు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్‌బాబుపై ఓడిపోయారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామనుకున్న ప్రవీణ్‌రెడ్డికి అప్పుడు కూటమిలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ సీపీఐకి అవకాశం ఇచ్చింది. సీపీఐ నుంచి పోటీ చేసిన చాడ వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్‌బాబు చేతిలో 70,157ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో అలిగిన ప్రవీణ్‌రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నాలుగేండ్లుగా ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో మళ్లీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో టిక్కెట్ హామీతో హస్తం గూటికి వచ్చారు. కొద్దిరోజులుగా ప్రచారమూ నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎంట్రీతో మళ్లీ అంతర్మథనంలో పడ్డారు. అయిననప్పటికీ టిక్కెట్ తనకే వస్తుందని భావించినా బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మెన్‌గా పొన్నంకు అవకాశం ఇవ్వడం, ఇక్కడ బీసీ ఓటర్లే ఎక్కువగా ఉండటం ఆయన్ను ఆలోచనలో పడేసింది.
టిక్కెట్ రాకపోతే ప్రవీణ్‌రెడ్డి దారెటు?
మాజీ ఎంపీ ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే పొన్నం హుస్నాబాద్‌కు మారాలని నిర్ణయించుకున్నట్టు కొందరు ‘హస్తం’ నాయకులు చెబుతున్నప్పటికీ ఇరువురూ వేర్వేరుగానే పార్టీలో సన్నాహాకాలు చేసుకుంటున్నారు. అయితే పొన్నంకు అవకాశం ఇచ్చి ప్రవీణ్ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారనే చర్చ సాగింది. అయితే ప్రవీణ్ రెడ్డి ఎప్పుడూ హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఆయనకు పెద్దగా పట్టు కూడా లేదు. ముల్కనూర్ కో ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ ప్రజలకూ సేవలందించారు. అలాంటిది ఆయన కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు పోయే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. మరోవైపు ప్రవీణ్ రెడ్డి తన అసెంబ్లీ ప్రచారాన్ని కొన్ని నెలల కిందట ప్రారంభించారు. నియోజకవర్గంలోని 160 గ్రామాలకు గాను ప్రతిరోజూ రెండు గ్రామాల చొప్పున 70కిపైగా గ్రామాల్లో తిరిగారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రవీణ్‌రెడ్డి అంతర్మథనంలో పడ్డారు.
వరుస ఓటమితోనే హుస్నాబాద్‌కు..
2009లో కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రభాకర్, 2014లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి పోటీ చేసి మళ్లీ మూడో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో వరుస పరాజయాల తర్వాత ప్రభాకర్ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న హుస్నాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ తన గౌడ సామాజిక తరగతితో పాటు ఇతర బీసీ కులాల ఓటర్లూ ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో సుమారు 70శాతం (1.10 లక్షల నుంచి 1.20 లక్షలు) బీసీ ఓటర్లే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
పొత్తుకుదిరి మళ్లీ సీపీఐకి ఇస్తే…
పొన్నం, ప్రవీణ్‌రెడ్డి మధ్య టికెట్టు కోసం పోటాపోటీ నెలకొని ఉన్న తరుణంలో అనూహ్యంగా ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు అంశం తెరపైకి వచ్చింది. సీపీఐ కోరుతున్న స్థానాల్లో హుస్నాబాద్ నియోజకవర్గమే కీలకంగా ఉంది. 2018లోనే హుస్నాబాద్‌ను సీపీఐకి ఇచ్చి చేజార్చుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఇస్తే పరిస్థితి ఏంటనే అంతర్మథనంలో ‘హస్తం’ శ్రేణులు పడ్డాయి. మరోసారి ఆ పరిస్థితి రాకుండా కాంగ్రెస్ ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ పార్టీ వర్గాలు హైకమాండ్‌కు సంకేతాలూ పంపుతున్నాయి.
కమ్యూనిస్టులకు కంచుకోటగా..
హుస్నాబాద్ ఏర్పడకముందు ఇందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతానికి 11సార్లు ఎన్నికలు జరిగితే పీడీఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ)లు కలిసి నాలుగుసార్లు గెలిచాయి. సీపీఐ ఆరుసార్లు విజయం సాధించింది. అందులోనూ సీపీఐ నుంచి దేశిని చిన మల్లయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2002లో ఆయన పార్టీని వదిలివెళ్లిపోయారు. మరో సీపీఐ నేత బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి, బుగ్గారంలో మరోసారి గెలిచారు. టీడీపీ ఒక్కసారి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించలేదు. మొత్తంగా కమ్యూనిస్టులకు కంచుకోటగా హుస్నాబాద్ పేరొందింది.