ఉద్యమాల గ‌డ్డ హుస్న‌బాద్

Udhyamala Gadda Husnabad– ఇందుర్తిలో సీపీఐ, కాంగ్రెస్‌కు సమభాగం
– పునర్విభజనలో బీఆర్‌ఎస్‌కే మొగ్గు
– యువత, మహిళా ఓట్లు కీలకం
నవతెలంగాణ హుస్నాబాద్‌ రూరల్‌
ఉద్యమాలకు మారుపేరుగా హుస్నాబాద్‌ గడ్డ ఊపిరి పోసుకున్నది. పేదల కోసం కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసిన చరిత్ర హుస్నాబాద్‌ ప్రాంతానిది. నైజాంకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించడం, నాడు సాయుధ పోరాటంలో పోరాడి అమరులయ్యాయిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి చైతన్యం కలిగిన ఈ ప్రాంతం ఆది నుంచి కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నది.
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ఎన్నికల ప్రచార ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి విజయ దుందుబి మోగించారు. రెండోసారి కూడా అదే ఫార్ములాతో ప్రచారం ప్రారంభించి మరోమారు గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పుడు మూడోసారీ అదే సెంటమెంట్‌ను ఫాలో అవుతున్నారు. దాంతో రాజకీయ రంగంలో హుస్నాబాద్‌కు ఓ ప్రత్యేకత సంతరించుకున్నది.
ఇందుర్తిలో సీపీఐ, కాంగ్రెస్‌కు సమభాగం
నియోజకవర్గాల పునర్విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. 15 సార్లు ఎన్నికలు జరగ్గా పునర్విభజనకు ముందు ఇందుర్తి నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది. కాంగ్రెస్‌ 5 సార్లు, సీపీఐ 6 సార్లు విజయం సాధించింది. ఇందుర్తి నియోజకవర్గం ప్రజలు సీపీఐ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు సమభాగంగా విజయాన్ని అందించారు. 2009లో హుస్నాబాద్‌ నియోజకవర్గ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ రెడ్డి గెలుపొందగా తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ప్రజలు పట్టం కట్టారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ రెండోసారి గెలవడంతో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ మధ్య గట్టి పోటీ ఉంటుంది. కాగా, ఈసారి హుస్నాబాద్‌లో యువత, మహిళల ఓట్లు కీలకంగా మారనుంది. నియోజకవర్గ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి హ్యాట్రిక్‌ ఇస్తారా.. లేదా కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తారా వేచి చూడాల్సిందే.
మొట్టమొదట హుస్నాబాద్‌ నుస్తుల్లాపూర్‌లో..
హుస్నాబాద్‌ నియోజకవర్గం మొట్టమొదట 1952లో నుస్తులాపూర్‌గా నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో హుస్నాబాద్‌, బెజ్జంకి, మానకొండూర్‌, నుస్తులాపూర్‌ మండలాలున్నాయి. 1957లో నియోజకవర్గ పునర్విభజనలో ఇందుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ఉమ్మడి హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, చిగురు మామిడి మండలాలతో ఇందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. 2009లో మరొకసారి నియోజకవర్గ పునర్విభజన చేశారు. పునర్విభజనలో ఇందుర్తి నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాన్ని మానకొండూరులో కలిపారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని సైదాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను ఇందుర్తి నియోజకవర్గం లోని ఉమ్మడి హుస్నాబాద్‌, కోహెడ, చిగురుమామిడి మండలాలతో హుస్నాబాద్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది.

Spread the love