హుస్సాముద్దీన్‌ అవుట్‌!

– అమిత్‌, ఆకాశ్‌, వికాశ్‌లకు చోటు
– ఆసియా క్రీడల బాక్సింగ్‌ ప్రాబబుల్స్‌
న్యూఢిల్లీ : తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ ఆసియా క్రీడలకు దూరమయ్యాడు!. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో గాయంతో 57 కేజీల సెమీస్‌ బౌట్‌ నుంచి వాకోవర్‌ ఇచ్చిన హుస్సాముద్దీన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో ట్రయల్స్‌కు అందుబాటులో లేడు. దీంతో అతడిని ఆసియా క్రీడలకు పరిగణనలోకి తీసుకోవటం లేదు. పటియాలలో జరిగిన జాతీయ ట్రయల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ పతకాలు సాధించిన అమిత్‌ పంఘాల్‌, ఆకాశ్‌ కుమార్‌, వికాశ్‌ కృష్ణన్‌లు తమ విభాగాల్లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ట్రయల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న బాక్సర్లతో శిక్షణ శిబిరం నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తారు. అమిత్‌ పంఘాల్‌ 51 కేజీల విభాగంలోనే పోటీపడుతుండగా.. ఆకాశ్‌ కుమార్‌ 57 కేజీలు, వికాశ్‌ కృష్ణన్‌లు 80 కేజీలకు మారారు. హుస్సాముద్దీన్‌ కేటగిరీలో సెమీఫైనల్స్‌లో ఓడిన రోహిత్‌, సచిన్‌లకు బౌట్‌ నిర్వహించి విజేతను ప్రాబబుల్స్‌ జాబితాలోకి తీసుకోనున్నారు. అనారోగ్యంతో ట్రయల్స్‌కు రాలేని మనీశ్‌ కౌశిక్‌ కోలుకున్న అనంతరం విజరు కుమార్‌తో పోటీపడాల్సి ఉంటుందని, అప్పుడే 63.5 కేజీల విభాగంలో బెర్త్‌ ఖాయం అవుతుందని బాక్సింగ్‌ వర్గాల సమాచారం.

Spread the love