హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతాం : హైదరాబాద్‌ సీపీ

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్టీల పేరుతో డ్రగ్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని.. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి హెచ్చరించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగం ఎక్కువగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో చాలా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కొందరు సినీ వ్యక్తులు డ్రగ్స్ వాడుతూనే ఉన్నారని.. డ్రగ్స్‌ మూలాలు ఇంకా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామని.. దీన్ని సాకారం చేసేందుకు ఎంత వరకైనా వెళ్తామన్నారు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కల్చర్ ఆపితే డిమాండ్ తగ్గుతుందన్నారు. డిమాండ్‌ లేకపోతే డ్రగ్స్‌ వినియోగం ఉండదన్నారు. సినీ ప్రముఖులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ వాడకాన్ని నియంత్రించేందుకు కృషి చేయాలని సూచించారు. ముందుగా సినిమా ప్రముఖులతో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత డ్రగ్స్‌లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ రహిత నగరంగా తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు త్వరితగతిన నగరవ్యాప్తంగా మాదకద్రవ్యాల తనిఖీలను నిర్వహించడానికి ర్యాపిడ్ యాక్షన్ టీమ్‌లను తీసుకువస్తున్నామన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారికి హైదరాబాద్‌లో చోటు లేదన్నారు. డ్రగ్స్‌ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారన్నారు.

Spread the love