– మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన 250 మంది రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లలో చేపట్టిన ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను వివరించారు. విద్యుత్, తాగునీటి సరఫరా సంక్షోభాలను అధిగమించినట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వెల్లడించారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో వరసగా రెండో సారి బెంగుళూరు నగరాన్ని హైదరాబాద్ దాటేసిందనీ, ఐటీ ఎగుమతులు, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతినిధులు తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రశంసించారు.