హైదరాబాద్ : 14వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ఆరంభమైంది. మాదాపూర్‌లోని ఎన్‌వీకే టెన్నిస్ అకాడమీలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం పోటీలను అధికారికంగా ప్రారంభించారు. పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో ఈవెంట్లలో 30, 40, 50, 60, 70 ప్లస్ వయో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా, మహిళలు ఓపెన్ విభాగంలో పోటీపడనున్నారు. ఓపెన్ విభాగంలో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈవెంట్‌ను గత సీజన్ నుంచి నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 451 మంది టెన్నిస్ క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ అక్టోబర్ 2న అన్ని విభాగాల్లో ఫైనల్స్‌తో ముగియనుందని హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం (హెచ్‌ఓటీఏ) ఫౌండర్ ప్రెసిడెంట్ నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. టోర్నీలో పోటీపడుతున్న క్రీడాకారులకు నాలుగు రోజుల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. సింగిల్స్ విభాగంలో 303, డబుల్స్ విభాగంలో 149 మంది టైటిల్ వేటలో బరిలోకి దిగుతుండగా.. విజేతలకు రూ. 5 లక్షల భారీ నగదు బహుమతి ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ జి. ప్రదీప్, పి.వి రావు, హరికష్ణా రెడ్డి, ఏ.ఆర్ రావు, సదాశివా రెడ్డి, అనిరుధ్, లగ్గాని శ్రీనివాస్, జె.వి రమణ తదితరులు పాల్గొన్నారు.