హైడ్రాదూకుడు..

Hidradukudu..– భారీ బందోబస్తు, జేసీబీలతో అక్రమ కట్టడాలపై పంజా
– మరోవైపు ఆపరేషన్‌ ఆపాలని ఒత్తిడి తలొగ్గకుండా ముందుకు
– నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ నేలమట్టం
– నోటీసులివ్వలేదు: నటుడు అక్కినేని నాగార్జున
– అనుమతుల్లేవ్‌: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైడ్రా దూకుడు కబ్జాదారుల్లో దడ పుట్టిస్తోంది. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) బ్రేకులు లేకుండా బుల్డోజర్లతో దూసుకెళ్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ నాయకులు, సిీహిరోలు, బిల్డర్లు, పలుకుబడి వున్న బడా నేతలు అనే తేడా లేదు.. ఎవరైనా సరే.. చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు, లే ఔట్లు వేసినా భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చేస్తున్నారు. అందరూ ఊహించిన దానికంటే హైడ్రా చాలా దూకుడుగా వెళ్తుండటంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్లతో పాటు ప్రముఖ నాయకులు, బిల్డర్లు, రియల్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఈ హైడ్రా ఆపరేషన్‌లను ఆపాలని శాయశక్తులా ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల్లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీవారు సైతం ముఖ్యమంత్రిని కలిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. హైడ్రా వెనక్కు తగ్గేలా ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడ రాజీ లేకుండా హైడ్రా కమిషనర్‌ దూసుకెళ్తున్నారు. రెండు మూడ్రోజుల్లో మాజీ మంత్రి మల్లరెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధుల ఆక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌజ్‌లను కూల్చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.
అనుమతుల్లేవ్‌: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ను శనివారం హైడ్రా అధికారులు కూల్చేశారు. తుమ్ముడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్‌ఎంస్‌, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది కూల్చి వేశారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ సైతం ఒకటని, చెరువులోని ఎల్‌టీఎఫ్‌లో ఎకరా 12 గుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని చెప్పారు. బఫర్‌ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని, ఎన్‌ కన్వెన్షన్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవని తెలిపారు. బీఆర్‌ఎస్‌ కింద అనుమతుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌ యత్నించిందనీ, అయితే, సంబంధిత అధికారులు అనుమతించలేదని అన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టూ స్టే ఇ్వలేదన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌కు సంబంధించి కన్వెన్షన్‌ సెంటర్‌ తప్పుదోవ పట్టించిందన్నారు. వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని తెలిపారు.
నోటీసులివ్వలేదు: నటుడు అక్కినేని నాగార్జున
ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు ముందు కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదని, ఒకవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు అర్ధాంతరంగా ఎలా కూల్చివేస్తారని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. దీనిపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టి కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయడం బాధాకరమన్నారు. అది పట్టా భూమి అని, ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని, ప్రయివేటు స్థలంలో భవనం నిర్మించామని అన్నారు. తప్పుడు సమాచారంతో కూల్చివేశారన్నారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

Spread the love