నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని మొదలుపెట్టింది. ఇప్పటికే పలుచోట్ల ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుపై కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలకు ఆదేశిస్తున్నారు. యాప్రాల్, అమీన్పూర్ లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని అందిన ఫిర్యాదుపై స్పందించిన రంగనాథ్ సోమవారం అధికారులతో కలిసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా చెరువు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడారు. చెరువులు ఎంతవరకు ఆక్రమణకు గురయ్యాయన్న విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ట్రై సిటీ పరిధిలోని చెరువులను ఆక్రమించడంతో పాటు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులను అదేశించినట్టు తెలిపారు.