నేను యోగా చేస్తున్నా..మరీ మీరు..?

– అందరూ ఆరోగ్యంగా ఉండాలి గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌
– కీర్తిరెడ్డి ఫౌండేషన్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న తాను యోగా చేస్తున్నానని.. మరీ మీరెందుకు చేయరని, అందరూ యోగా చేయాలని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ తెలిపారు. కీర్తిరెడ్డి ఫౌండేషన్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో హౌలిస్టిక్‌ ఆస్పత్రి సౌజన్యంతో ఆదివారం హైదరాబాద్‌లోని బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మఖ్య అతిథులుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఏబీవీ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ కావ్యారెడ్డి, హౌలిస్టిక్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ ఆలూరి తుషారా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కీర్తిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పేదలకు ఇలాంటి మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. లైఫ్‌ ఈజ్‌ ఫుల్‌ ఆఫ్‌ ఛాలెంజస్‌ అని.. వాటిని ఎదుర్కొవాలంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారన్నారు. తన భద్రతా సిబ్బంది ఇక్కడకు రావొద్దని హెచ్చరించినా ఇక్కడ వీధులు ఇరుకు కానీ ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమం గొప్పది అని వచ్చానన్నారు. ప్రతి సంవత్సరం అందరూ విధిగా హెల్త్‌ చెకప్‌ చేయించుకో వాలన్నారు. కీర్తిరెడ్డి ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ జూటూరి కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని తెలిపారు. అనంతరం కావ్యారెడ్డి మాట్లాడుతూ.. మంచి ఆహారపు అలవాట్లు మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ యోగా చేయాలని చెప్పారు. జంక్‌ఫుడ్‌ తినొద్దని, పిల్లలు ఏం తింటున్నారో పెద్దలు గమనించాలని సూచించారు. అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన టీబీ ఎరాడికేషన్‌ కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులకు గవర్నర్‌ చేతుల మీదుగా న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, ఈసీజీ, 2డీఎకో, కంటి పరీక్షలు, బోన్‌ డెన్సిటీటెస్ట్‌, గైనకాలజీ, మాతృ సంరక్షణకు సంబంధించిన వివిధ సేవలను వైద్యులు అందించారు. హెల్త్‌ క్యాంపునకు 300 మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

Spread the love