రోడ్డు ధ్వంసమై నా పట్టించుకోరా

రోడ్డు ధ్వంసమై నా పట్టించుకోరా– కల్వర్టుకి తక్షణమే నిధులు మంజూరు చేయాలి
– ఏఎస్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తమ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కల్వర్టు కుంగిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తోందని, గత మూడు సంవత్సరాలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అచ్యుతాపురం గ్రామస్తుడు, ఏఎస్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు ఆరోపించారు. ఇటీవల మండల రివ్యూ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కు సైతం అచ్చుతాపురం రహదారి పరిస్థితిని చూపించి వివరించామని తెలిపారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారి అద్వానంగా మారడంతో పాటు, కల్వర్టు సైతం తెగిపోయే ప్రమాదం ఉందని, దీనివలన రాకపోకల సైతం నిలిచిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే కలవర్టుకి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే అచ్చుతాపురం గ్రామస్తులతో కలిసి లక్ష్మీనగరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Spread the love