నాకెలాంటి ఫామ్‌హౌస్‌ల్లేవు

like me No farmhouses– బఫర్‌జోన్‌లో ఉంటే కూల్చేయండి
– ఆ జోన్‌లో ఉన్న సీఎం ఫామ్‌హౌస్‌ సంగతేంటి?
– మంత్రులు, ఇతర కాంగ్రెస్‌ నేతల నిర్మాణాలను కూల్చేయగలరా?
– ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌
– రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తనకు ఎక్కడా, ఎలాంటి ఫామ్‌హౌస్‌లూ లేవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. జన్వాడలో తన స్నేహితుడికి సంబంధించిన ఫామ్‌హౌస్‌ను తాను లీజుకు తీసుకున్నానని ఆయన వెల్లడించారు. ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, బఫర్‌జోన్‌లో ఉన్నా నిర్వందంగా కూల్చేసుకోవచ్చని సూచించారు. తాను తప్పు చేశానని నిర్దారణ అయితే చర్యలు తీసుకోవచ్చని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయకుమార్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. తాను లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం… ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మహేందర్‌రెడ్డి, వివేక్‌ లాంటి వారి నిర్మాణాలపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయా ఫామ్‌హౌస్‌ల సంగతేంటని ప్రశ్నించారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ముందు వాటిని కూల్చేయాలంటూ సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామాను ఆపాలంటూ ఆయన హితవు పలికారు. రుణమాఫీ పేరిట రేవంత్‌ ప్రభుత్వం రైతులను పచ్చిగా మోసం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. పావుశాతం రుణాలను మాఫీ చేసి, వందశాతం చేసినట్టు బిల్డప్‌లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీపై సీఎం ఒక మాట మాట్లాడుతుంటే, ఆయన మంత్రివర్గ సహచరులు తలోమాట మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా తదితరాంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం… బజారు భాషను ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉచ్చులో తమ పార్టీ పడబోదని వ్యాఖ్యానించారు. ప్రతీ రైతు రుణం మాఫీ అయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ విషయంలో రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచేందుకే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు తమ పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ వాటిని జయప్రదం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
నేడు చేవెళ్లకు కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించబోయే రైతు ధర్నాకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Spread the love