నవతెలంగాణ- ఆర్మూర్:
లెక్కలేనన్ని సార్లు మీ ఊరికొచ్చా..మీ ఇంటికొచ్చా. మీకే కష్టమొచ్చినా మీ బిడ్డలా అండగా నిలిచా. మీతో కలిసి బువ్వ తిన్న.. మీ కష్ట సుఖాలు విన్న. మీరు మా ఇంటికొస్తే బువ్వ పెట్టా. ఖానాపూర్ కాలరెగిరేసేలా అభివృద్ధి చేశా అని అర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాధపురం’ కార్యక్రమంలోభాగంగా శనివారం మండలంలోని ఖానాపూర్ గ్రామంలో జీవన్ రెడ్డి ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరుతో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామమంతా కలియతిరిగి బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జీవన్ రెడ్డికి ఖానాపూర్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి జీవన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. స్థానిక ప్రజలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, ముఖ్యంగా యువకులు, మహిళలు మేళ తాళ్లాలతో జీవన్ రెడ్డి కి బ్రహ్మరథం పట్టారు. మహిళలు బోనాలతో ప్రదర్శన ముందు వరుసలో నడవగా యువకులు బాణ సంచా కాలుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామ పెద్దలు పూలమాలలు, శాలువాలతో జీవన్ రెడ్డిని సన్మానించారు. “జై జీవనన్న, జైజై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్ , జై తెలంగాణ” వంటి నినాదాలతో ఖానాపూర్ మారుమోగింది. జీవన్ రెడ్డి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రజలను పలకరించారు. ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి మంచీ చెడుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. స్థానికంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన అనేక సమస్యలను ఆయన అక్కడిక్కడే పరిష్కరించారు. . అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ “నేను ఖానాపూర్ కు వచ్చే సమయంలో ఇదే గ్రామానికి చెందిన నరసయ్య అనే వికలాంగుడు నాకు ఎదురుపడి నాలాంటి వికలాంగులకు మా తల్లిదండ్రులను మించిన దైవం కేసీఆర్ గారు. మీరు తిరిగినా తిరగకున్నా మేమే ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పాడు. అయినా నేను ఈ పదేళ్ళలో ఈ గ్రామానికి ఏం చేశానో చెప్పి మీ కడుపులో తలపెట్టి నన్ను మళ్లీ దీవించాలని అడగడానికి వచ్చా అని చెప్పిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖానాపూర్ గ్రామ ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. “ఖానాపూర్ గ్రామపంచాయతీలో 319 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు 78, వితంతు పింఛన్లు 77 వికలాంగుల పింఛన్లు29, గీత కార్మికుల పింఛన్లు1, ఒంటరి మహిళల పింఛన్లు 17, బీడీ కార్మికుల పింఛన్లు 117, కలుపుకొని నెలకు 2016 4 2016 చొప్పున ఈ గ్రామానికి ఇప్పటివరకు మొత్తం రూ. 6.39 కోట్లు పెన్షన్ల రూపంలో వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన 555 మందికి రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ.4.70 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈ గ్రామంలో వివిధ కారణాల వల్ల చనిపోయిన ఆరుగురు రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు రైతు బీమా పరిహారం అందింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా 53 మంది ఆడపిల్లలకు రూ.46.6 లక్షలు ఇచ్చి పెళ్లిళ్లు జరిపించాం. ఈ గ్రామంలో వివిధ కారణాల చేత అనారోగ్యానికి గురైన 19 మందికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.24.43 లక్షల ఆర్థిక సాయం అందించాం. రూ.3.48 లక్షల ఖర్చు చేసి ఈ గ్రామంలో మొత్తం 326 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఈ గ్రామంలోని 32 మహిళా గ్రూపులకు రూ.13.81 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించాం. 650 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు జరిగిన ఈ గ్రామానికి చెందిన 95 మంది తల్లులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం. మగ్గిడి నుంచి మరంపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.9.67 కోట్లు,పిప్రి నుంచి ఖానాపూర్ రోడ్ వయా మగ్గిడి వరకు రోడ్డుకు రూ. 1.69 కోట్లు, ఖానాపూర్ నుంచి సుర్బి ర్యాల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.32 కోట్లు, ఖానాపూర్ నుంచి నిర్మాణానికి మరో రూ.22.75 లక్షలు, ఈ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.24 లక్షలు, వడ్డెర కాలనీ ఫంక్షన్ హాలుకు రూ.25 లక్షలు, బీసీ వాడ ఫంక్షన్ హాలుకు రూ.10 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాలు కు రూ.5లక్షలు, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాలుకు రూ.5లక్షలు, గుండ్ల సంఘ భవనానికి రూ. 5లక్షలు, మేదర సంఘ భవనానికి రూ.5 లక్షలు దహించు అగ్ని చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.29 లక్షలు, కల్వరి చర్చి కాంపౌండ్ వాల్ కు రూ.4 లక్షలు, దళితవాడలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.5 లక్షలు, గోసంగి కమ్యూనిటీ హాలుకు రూ.3లక్షలు నిధులు మంజూరు చేసాం. ఖానాపూర్ గ్రామపంచాయతీకి ఇప్పటివరకు రూ.21.10 కోట్లు అభివృద్ధి నిధులు అందాయి అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మీ గ్రామం కోసం ఏం చేశానో చెప్పడానికొచ్చిన నాకు అఖండ స్వాగతం పలికిన ఖానాపూర్ ప్రజలకు నా పాదాభి వందనాలు. గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఇన్ని సార్లు మీ ఊరికొచ్చాడా?. కనీసం మీ కష్టాలు పట్టించుకున్నారా?.
కాంగ్రెస్, బీజేపీలు మీ ఊరిని,మిమ్మల్ని ఏనాడైనా పట్టించుకున్నాయా?.నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే నా బాట. కేసీఆర్ నాదైవం, ఆర్మూర్ నియోజక వర్గ ప్రజలు బలం. మళ్లీ నన్ను ఆశ్వీర్ధించండి. కాంగ్రెస్, బీజేపీ లను నమ్మితే అధోగతే అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్, బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..