న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముంది

I have full faith in the judiciary– అక్రమ కేసులపై అక్కడే తేల్చుకుంటా : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత పౌరునిగా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై రేవంత్‌ సర్కార్‌ అక్రమంగా బనాయించిన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందనీ, ఎలాంటి కేసునైనా అక్కడే తేల్చుకుంటానని ఆయన తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, జన్వాడ ఫాంహౌస్‌, హైడ్రా తదితర చర్యలతో గతేడాది నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన రేవంత్‌ సర్కార్‌ అటెన్షన్‌ డైవర్షన్‌ కోసమే ఇలాంటి నాటకాలాడుతోందని ఆయన దుయ్యబట్టారు. అందువల్ల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ డైవర్షన్‌కు గురికావద్దని ఆయన సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌ వేరు వేరు కాదనీ, హస్తం పార్టీ రక్షణ కవచంలా కమలం పార్టీ పని చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఆ రెండు పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెట్టాలంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ-రేస్‌లో తాను అణాపైసా అవినీతికి పాల్పడలేదనీ, పైపెచ్చు హైదరాబాద్‌, తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని గుర్తుచేశారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు అవినీతిపరులకు, రూ.50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన దొంగకు ప్రతిపనిలో అవినీతి కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రేరేపిత, కక్షసాధింపు కేసు అని తెలిసినా తాను సోమవారం విచారణకు హాజరయ్యేందుకు వెళ్లానని తెలిపారు. గతంలో తమ నాయకులు పట్నం మహేందర్‌ రెడ్డి ఇవ్వని స్టేట్‌ మెంట్‌ను కూడా ఇచ్చినట్టుగా మీడియాకు లీకులివ్వడంతో తన న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్లినట్టు తెలిపారు. ఈ-రేస్‌పై అసెంబ్లీ చర్చ పెట్టమంటే సీఎం రేవంత్‌రెడ్డి భయపడి పారిపోయారనీ, మరోసారి న్యాయవాది సమక్షంలో విచారణ అంటే వెనుకడుగు వేశారని తెలిపారు. భయపడుతున్నది కాంగ్రెస్‌ నాయకులే తప్ప తాము కాదన్నారు. న్యాయవాదిని వెంటబెట్టుకుని విచారణకు వెళ్లేందుకు హైకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. హైకోర్టు తాను వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తే తనకేదో ఉరిశిక్ష పడినంతగా కాంగ్రెస్‌ నాయకులు శునకానందంతో కామెంట్‌ చేస్తున్నారని విమర్శించారు.
దుర్మార్గుల నుంచి రక్షణ కోసమే తాను హైకోర్టుకు వెళ్లానని కేటీఆర్‌ తెలిపారు. ట్రయల్స్‌ మీడియాలో, సచివాలయంలో, మంత్రుల పేషీల్లో జరగవన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమేననీ, తన లాయర్‌తో కలిసి హాజరవుతానని మరోసారి పునరుద్ఘాటించారు. హైకోర్టు తాను తప్పు చేశాననీ గానీ, స్కాం అని గానీ, శిక్ష అనే పదాలే వాడలేదని గుర్తుచేశారు. సీఎం నోటి నుంచి వచ్చేవి వేదవాక్కులు, భగవద్గీత సూక్తులు కావన్నారు. గ్రీన్‌ కో నుంచి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకోని పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
మెఘా కృష్ణారెడ్డితో రేవంత్‌ రెడ్డి క్విడ్‌ ప్రోకో
మెఘా కృష్ణారెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి క్విడ్‌ ప్రోకో చేశారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మెఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్‌కు నిధులిచ్చారనీ, అందుకే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ ఇచ్చారా? అక్కడ్నుంచి రాఘవ ఇంజినీరింగ్‌కు అప్పగించారా? అని నిలదీశారు. మెఘా కృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌కు కూడా నిధులిచ్చారని తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు తెస్తామన్న ప్రాజెక్టులో కూడా మెఘా కృష్ణారెడ్డికి రూ.4 వేల కోట్ల కాంట్రాక్ట్‌ అప్పగిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని తెలిపారు. సుంకేశుల రిటైన్‌ వాల్‌ కుంగినప్పుడు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాల్సిన మెఘాకే మళ్లీ కాంట్రాక్ట్‌ ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఒక కాంట్రాక్టర్‌ మంత్రి, బ్రోకర్‌ సీఎం అయితే ఇలాంటి ఆరోపణలే వస్తాయని ఎద్దేవా చేశారు. క్విడ్‌ ప్రోకో అంటే నాకింత – నీకింత అని తెలుగు అర్థం అని తెలిపారు. గ్రీన్‌ కోకు తన నుంచి లాభం జరిగిందని విమర్శలు చేస్తున్నవారు తనకు వచ్చిన లాభమేంటో చెప్పడం లేదనీ, దీన్ని క్విడ్‌ ప్రోకో అని ఎలా అంటారని ప్రశ్నించారు.

Spread the love