– ఇది వ్యక్తిగత కార్యాలయం మాత్రమే
– ప్రజలకు మరింత సేవలు అందించేందుకే ఈ నిర్ణయం
– నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చల్మెడ వ్యాఖ్యలు
నవ తెలంగాణ – వేములవాడ
తాను నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలు అందించాలానే ఉద్దేశ్యంతోనే వేములవాడ పట్టణంలో నూతన కార్యాలయం ప్రారంభించానని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మేడ లక్ష్మీ నరసింహ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులోని నంది చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిర్యాల ప్రభాకర్ రావుతో కలసి చల్మెడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో తమ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించామని, అదే క్రమంలో మరింత మందికి సేవలు విస్తరింపజేయాలనే ఉద్దేశ్యంతో, ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఈ కార్యాలయం ప్రారంభించామని అన్నారు. ఈ క్రమంలో రాజకీయ ఉద్దేశ్యంతో,రాబోయే ఎన్నికల్లో పోటీ పోటీ చేసేందుకే ఇదంతా చేస్తున్నారా అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చల్మెడ స్పందిస్తూ పార్టీ ఆదేశిస్తే బరిలో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, ప్యాక్స్ ఛైర్మన్లు కిషన్ రావు, నరసయ్య యాదవ్,నాయకులు గజనంద రావు, తీగల రవీందర్ గౌడ్, అరె మహేందర్, జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.