నేను రాను బాబోయ్ సర్కార్ దవాఖానాకు..

I will not come to Baboy Sarkar Davakhana..– నియోజక వర్గం కేంద్రం లో..
– పేరుకే పెద్దాసుపత్రి – ప్రధమ చికిత్సలకే పరిమితం..

– వేదిస్తున్న వైద్యుల కొరత..

– చాలీచాలని బెడ్ లు..
– విశ్రాంతి గదే వార్డ్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రం అయినప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు.ఈ నియోజక వర్గం ఏర్పడి 20 ఏళ్ళు పూర్తి కావస్తున్నా అభివృద్ది మాత్రం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అశ్వారావుపేట లో పెద్ద ఆసుపత్రి ఉన్నా ప్రధమ చికిత్స కే పరిమితం అవుతుంది.నేటికి మలేరియా,డెంగ్యూ వ్యాధులకు సైతం సరైన వైద్యం అందుబాటులో లేదంటే వైఫల్యం ఎవరిది? వైద్య విధాన పరిషత్ యాజమాన్యం లో 30 పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది.పేరుకు మాత్రం పెద్ద ఆసుపత్రి కాని అత్యవసర రోగులకు ప్రధమ చికిత్స కే పరిమితం అయ్యే పరిస్దితి ఉంది. ప్రతీ నియోజక వర్గం కేంద్రంలో 100 పడకల ఆసుపత్రులు నిర్మాణం అవుతున్నాయి.ఇక్కడా మంజూరు అయింది కానీ  నిర్మాణం ఛాయలు ఏమీ కనిపించడం లేదు.ప్రస్తుతం ఈ ఆసుపత్రి ప్రాంగణంలో గతేడాది ఐటీడీఏ నిధులతో విశ్రాంతి గది ఒకటి నిర్మించారు.ఇపుడు వార్డు గా వినియోగిస్తున్నారు. ఒక్కో బెడ్ కు ఇద్దరేసి రోగులు ను సర్ధుబాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 16 మంది వివిధ వైద్య రంగాల లో నిపుణులైన వైద్యులు ఉండాలి. కానీ 12 మంది వైద్యులు ఇక్కడ ఉన్నా 5 గురు మాత్రమే విధుల్లో ఉన్నారు.మరో 7 గురు డిప్యుటేషన్ లో వేరు వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. పోస్టింగ్ ఒక చోట పని మరోచోట అన్నట్లు. ఉన్న ఈ అయిదుగురు లో జనరల్ మెడిసిన్,ఆర్థోపెడిక్,డెంటల్,గైనకాలజిస్ట్, అనస్థటిస్ట్ లలో ఇరువురు ఇన్ పేషెంట్ లను పర్యవేక్షిస్తారు.మరో ఇరువురు ఔట్ పేషెంట్ లను చూస్తారు.అత్యవసర వైద్యంలో మాత్రమే మత్తు వైద్యుడు అవసరం ఉంటుంది. నర్సింగ్ సిబ్బంది సైతం 12 మంది ఉండాలి ప్రస్తతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.మిగతా వారు డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 30 బెడ్ లకు గానూ డయాలసిస్ వైద్య విభాగానికి 5,కాన్పులు,ఇతర మహిళల వైద్య విభాగంలో 10,ఇతర అన్ని రకాల ఇన్ పేషెంట్ లకు 14,ప్రమాద క్షతగాత్రులకు అత్యవసరం వైద్యం అందించడానికి 1 బెడ్ ఇలా 30 బెడ్ లు ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణం,తరుణ వ్యాధులు విపరీతంగా పెరగడంతో రోజు వారీ 200 మంది పైగా ఆసుపత్రికి వైద్యానికి వస్తున్నారు.శనివారం నాటికి 68 మంది రకరకాల వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వర పీడితులు ఇన్ పేషెంట్ లు గా ఉన్నారు.వీరికోసం వార్డ్ లు లేకపోవడంతో విశ్రాంతి గదిలోనే వార్డ్ గా మార్చి ఒక్కో బెడ్ కు ఇద్దరేసి చొప్పున సర్ధుబాటు చేస్తున్నారు. ఎక్స్ రే,స్కానింగ్,రక్త సేకరణ,డయాలసిస్ లాంటి అధునాతన వైద్య పరికరాలు ఉన్నా సరిపడినంత గదులు లేకపోవడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు.ఇదంతా చూస్తే చూసి మురవ – చెప్పుకుని ఏడవ అన్న సామెత చందం గా ఉంది. కనీసం ఆసుపత్రి నిర్వహణకు సూపరింటెండెంట్ కూడా లేకపోవడంతో ఆలనా పాలనా లేని ఆసుపత్రి గా తయారైందని అక్కడి సిబ్బందే వాపోతున్నారు.
ఖాలీలు త్వరలో భర్తీ చేస్తాం – డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు
ఈ విషయం అయి నవతెలంగాణ డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు ను వివరణ కోరగా ఖాలీ లు త్వరలో భర్తీ చేస్తాం అని,సూపరింటెండెంట్ నియామకం చేస్తాం అని అన్నారు.
Spread the love