కిశోర్‌ని దష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ రాశా..

కిశోర్‌ని దష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ రాశా..హైదరాబాద్‌: ‘మళ్ళీ మొదలైంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్‌ ప్రస్తుతం వెన్నెల కిశోర్‌తో ‘చారి 111’ అనే సినిమా చేస్తున్నారు. వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ చిత్ర విశేషాలు తెలియజేశారు. ‘నేను సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గర పని చేయలేదు. ఎడిటర్‌గా నా కెరీర్‌ స్టార్ట్‌ చేశా. విజువల్‌ కమ్యూనికేషన్‌ కోర్స్‌ చేశా. టీవీ కమర్షియల్స్‌, కార్పొరేట్‌ ఫిలిమ్స్‌ ఎడిట్‌ చేశా. కాలేజీ చదివేటప్పుడు పాకెట్‌ మనీ కోసం టీవీ సీరియల్స్‌ ఎడిటింగ్‌ కూడా చేశా. తర్వాత బెంగళూరు వెళ్లి యాడ్‌ ఫిల్మ్స్‌ ఎడిటింగ్‌ చేశా. సుమారు పదేళ్లు యాడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఆ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్‌ కమెడియన్‌ రోల్‌ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు ‘చారి 111’ ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రిప్ట్‌ సెండ్‌ చేయమని అడిగారు. నేరేషన్‌ ఇవ్వమనలేదు. స్క్రిప్ట్‌ చదివిన తర్వాత ఓకే చెప్పారు. కిశోర్‌, మురళీ శర్మ గారిని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్‌ రాశా. భవిష్యత్తులో స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తాను.

Spread the love