నవతెలంగాణ హైదరాబాద్: గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత జట్టు సారథి రోహిత్ శర్మను ఎంపిక చేశారు. ఇక, ఈ జట్టులో భారత్ నుంచి మరో ముగ్గురు ఆటగాళ్లకూ చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య, లెఫ్ట్-ఆర్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. గతేడాది టీ20ల్లో రోహిత్ శర్మ అటు సారథిగా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా మెరుగైన ప్రదర్శన చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 42 సగటుతో 378 పరుగులు చేశాడు. 2024లో జరిగిన పొట్టి కప్పు మెగా సమరంలో టీమ్‌ఇండియా విశ్వవిజేతగా అవతరించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మూడు అర్ధశతకాలతో పాటు సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో అతడు చెలరెగిపోయాడు.
సీనియర్ పేసర్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. గతేడాది 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 2024లో అత్యంత కీలకమైన వికెట్ టేకర్‌గా అవతరించాడు. 18 మ్యాచ్‌ల్లో 13.50 సగటుతో 36 వికెట్లు తీసి అదరగొట్టాడు. హార్దిక్ పాండ్య 17 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీయడంతో పాటు 352 పరుగులతో ఆల్‌రౌండర్లలో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు.
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024
రోహిత్ శర్మ (కెప్టెన్; భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్; వెస్టిండీస్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్య (భారత్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), వానిందు హసరంగ (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్).