ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డ కడుతుందా?

Does ice form in the fridge?ప్రస్తుత కాలంలో ఫ్రిజ్‌ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. నీటిని చల్లబరచడం నుంచి మొదలు పెడితే, కూరగాయలను తాజాగా ఉంచుకోవటం, పాలు, రుబ్బుకున్న పిండులు, కూరల వరకూ ఫ్రిజ్‌ను బాగా వాడేస్తున్నారు. వేసవి, లేదా శీతాకాలమనే తేడా లేకుండా అన్ని సీజన్లలో రిఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తారు.
అయితే కొన్నిసార్లు ఫ్రిజ్‌లో ఐస్‌ పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రీజర్‌ తలుపు కూడా పట్టదు. శీతాకాలమైనా, వేసవి అయినా, ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా సింగిల్‌-డోర్‌ రిఫ్రిజిరేటర్లలో ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఎందుకు ఐస్‌ పేరుకుపోతుందని తెలియక సతమతమవు తుంటారు. దాన్ని ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్‌లోని వాటర్‌ ఫిల్టర్‌ దెబ్బతింటే, రిఫ్రిజిరేటర్‌ పెద్ద ఐస్‌ గడ్డలా తయారు అవుతుంది. దీనివల్ల ఫ్రీజర్‌లో ఉంచిన ఆహారమంతా ఐస్‌తో నిండిపోతుంది. ఇలాంటి సందర్భంలో, వాటర్‌ ఫిల్టర్‌ను మార్చడం మంచిది.
రిఫ్రిజిరేటర్‌ తలుపు సరిగ్గా మూయకపోతే లేదా దాని రబ్బరు దెబ్బతిన్నట్లయితే ఈ సమస్య వస్తుంది. దీనివల్ల బయటి నుండి వేడి గాలి రిఫ్రిజిరేటర్‌లోకి ప్రవేశించి ఐస్‌తో నిండిపోతుంది. అలాంటప్పుడు, రబ్బరును వీలైనంత త్వరగా మార్చాలి.
ఫ్రిజ్‌ లోపల ఒక పైపు ఉంటుంది, ఆ పైపు మూసుకుపోతే, రిఫ్రిజిరేటర్‌లో ఐస్‌ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పైపును క్రమం తప్పకుండా శుభ్రం చేయించుకోవాలి.
ఫ్రిజిరేటర్‌ వెనుక భాగంలో ఉన్న కాయిల్స్‌ కారణంగా రిఫ్రిజిరేటర్‌లో ఐస్‌ ఏర్పడుతుంది. ఈ కాయిల్స్‌ దుమ్ము, ధూళితో నిండి ఉంటే, రిఫ్రిజిరేటర్‌ సరిగ్గా పనిచేయదు. ఎక్కువ మంచు పేరుకుపోతుంది. ఈ కాయిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
రిఫ్రిజిరేటర్‌ మరీ పాతదైతే, కనీసం సంవత్సరానికి ఒకసారి దానిని సర్వీస్‌ చేయాలి. అలాగే, రిఫ్రిజిరేటర్‌ను వారానికి ఒకసారి లేదా నెలకు రెండుసార్లు శుభ్రం చేయండి. ఈ సులభమైన పద్దతులను పాటించడం ద్వారా, ఫ్రిజ్‌లో ఐస్‌ పేరుకుపోకుండా జాగ్రత్త పడొచ్చు. అలానే ఎక్కువ కాలం ఫ్రిజ్‌ను కాపాడుకోవచ్చు.

Spread the love