రఫా దాడులపై ఐసీజే విచారణ

ICJ inquiry into Rafa attacks– జబాలియా శరణార్ధ శిబిరంపై వందకు పైగా వైమానిక దాడులు
– కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన.
గాజా : రఫా నగరంపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులపై గురు, శుక్రవారాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) విచారణ జరపనుంది. దక్షిణాఫ్రికా కోరినట్టుగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యల గురించి చర్చిస్తామని తెలిపింది. ఇజ్రాయిల్‌ దారుణమైన రీతిలో రఫాపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా న్యాయస్థానాన్ని కోరింది. జనవరిలో ఇజ్రాయిల్‌పై పెట్టిన కేసులో భాగంగానే దక్షిణాఫ్రికా తాజాగా ఈ అభ్యర్ధన చేసింది. ఇజ్రాయిల్‌పై నమోదైన ఈ కేసులో ఆదివారం ఈజిప్ట్‌, టర్కీలు కూడా చేతులు కలిపాయి. రఫాపై ముమ్మరంగా దాడులు జరుగుతుండడంతో కాల్పుల విరమణ చర్చలు వెనుకపట్టు పట్టాయని మధ్యవర్తి ఖతార్‌ ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ చర్చల్లో ఊపు లేకుండా పోయిందని పేర్కొంది. గత కొద్ది వారాలుగా పరిస్థితులు అస్సలు బాలేదని, అయినా ఈ చర్చల గురించి ఏదో కాస్త ఉత్సాహాన్ని నింపినా, దురదృష్టవశాత్తూ తాజాగా జరిగిన పరిణామాలతో నీరు కారిపోయాయని ఖతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్‌ బలగాలు తూర్పు రఫాలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి దాడులకు దిగాయి.
జాబాలియా శరణార్ధ శిబిరంలో తమ కార్యకలాపాలను విస్తరించినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. సోమవారం నాడు వందకు పైగా వైమానిక దాడులు చేపట్టామని తెలిపింది. తూర్పు రఫా, జీటూన్‌ ఏరియాల్లో పాలస్తీనా ఫైటర్లను గుంపులు, గుంపులుగా తుదముట్టించినట్టు పేర్కొంది. మరోవైపు నుస్రత్‌ శరణార్ధ శిబిరంలో జరిగిన దాడిలో 20మంది మరణించారు. వీరిలో పిల్లలు కూడా వున్నారు. ఉత్తర గాజాలో ఇజ్రాయిల్‌ ట్యాంకులు పాలస్తీనియన్ల ఇళ్ళను నేలమట్టం చేస్తూ, పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డాయి.
గాజాలో మరణించిన వారి సంఖ్య అంటూ ప్రతి రోజూ పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న గణాంకాలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఇప్పటివరకు ఈ దాడుల్లో 35వేలమంది వరకు మరణించారని, వీరిలో దాదాపు 25వేల మందిని గుర్తించామని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.
ఇన్ని వేల మందిని గుర్తించారంటేనే ఈ డేటాలో ఎలాంటి తప్పు లేదని స్పష్టమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి క్రిస్టినా లిండ్‌మేర్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌ ఈ గణాంకాలను విమర్శించిన నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ వివరణ వెలువడింది. ఇప్పటివరకు 35,173మంది మరణించగా, 79,061మంది గాయపడ్డారు.
సహాయక సిబ్బంది కష్టాలు
రఫాపై ఉధృతంగా జరుగుతున్న దాడులతో నిర్వాసితులైన వేలాదిమంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇతర సరఫరాలు పంపిణీ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని సహాయక కార్యకర్తలు తెలిపారు. గత వారం రోజుల్లో రఫా నుండి 3,60,000మంది పాలస్తీనియన్లు వెళ్ళిపోయారని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్దుల సంస్థ తెలిపింది. ఎయిడ్‌ క్రాసింగ్‌లను తెరిచామని ఇజ్రాయిల్‌ ఆదివారం ప్రకటించింది. కానీ గత వారం రోజులుగా దక్షిణ గాజాలోని రెండు ప్రధాన క్రాసింగ్‌ల్లోకి ఆహారం ప్రవేశించలేదు. పరిస్థితులు రాన్రానూ భయంకరంగా తయారవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ప్రతినిధి అబీర్‌ ఇటెఫా వ్యాఖ్యానించారు.

Spread the love