ముందే గుర్తించండిలా..

హార్మోన్‌ ఇన్‌బాలెన్స్‌… ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. చాలామంది మహిళలు ఆ విషయాన్ని గుర్తించరు. సమస్యలు తీవ్రమై, డాక్టర్‌ దగ్గరకు వెళ్లాక గానీ కళ్లు తెరవరు. అలా కాకుండా ముందే గుర్తించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు హార్మోనల్‌ ఇన్‌బాలెన్స్‌ ఉందని ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం…

     హార్మోన్లు సరిగ్గా పని చేయకపోతే మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. ఆలోచనల్లో గందరగోళం, మతి మరుపు వంటి ఇబ్బందులు వస్తే ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది.
పీరియడ్స్‌ సమయంలో అంతకు ముందు లేని విధంగా కడుపునొప్పి, వికారం కనిపిస్తుంటే హార్మోన్ల పని తీరులో తేడా వచ్చినట్టే.
ప్రతి నెలా పీరియడ్స్‌ ఒకటి రెండు రోజులు ఇటు అటుగా వస్తే సమస్య లేదు. కానీ ఎక్కువ రోజులు, వారాల వ్యవధి వస్తున్నా, అసలు రాకున్నా ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ హార్లోన్ల అసమతుల్యత ఏర్పడినట్టే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పీసీఓడీ సమస్య తలెత్తుతుంది.
డిప్రెషన్‌, ఊరికే మూడ్‌ మారిపోవడం వంటివి కూడా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల జరగ వచ్చు. మెదడులో విడుదలయ్యే సెరెటోనిన్‌, డోప మైన్‌ లాంటి హార్మోన్లను ఈస్ట్రోజన్‌ ప్రభావితం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి.
నిద్ర పట్టక పోవడం హార్మోనల్‌ ఇన్‌ బాలెన్స్‌ సూచనే.
మొటిమలు అందానికి సంబంధించిన సమస్య అనుకుంటారు చాలా మంది. కానీ హార్మోన్ల అసమతుల్యతకీ మొటిమలకూ సంబంధం ఉంది. మొటిమలు వచ్చి ఎంతకీ తగ్గడం లేదంటే హార్మోన్ల సమస్య ఉందని అర్థం.
ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం, హఠాత్తుగా సన్నబడిపోవడం వంటివి ఏర్పడుతుంటే థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది.
హార్మోనల్‌ ఇన్‌బాలెన్స్‌ కారణంగా యోని పొడి బారడం, బ్రెస్ట్‌ టిష్యూస్‌ పలచబడటం లేదా మందంగా అవడం వంటివి కూడా జరుగుతాయి. సిస్టులు, గడ్డలు ఏర్పడతాయి.
వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఓసారి డాక్టర్‌ని కలవండి. హార్మోన్‌ టెస్ట్‌ చేయించుకుని సమస్య తీవ్రం కాకముందే బయటపడండి..

Spread the love