సేవ చేస్తున్నా గుర్తించండి…

Serving
Identify...– కాంగ్రెసోడు 3 గంటలంటడు.. బీజేపోడు మీటర్లంటడు
– ధరణితో భూమిపై రైతుదే పెత్తనం
– మెదక్‌ జిల్లాకు వరాల జల్లు : ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్‌
– మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నూతన భవనాలు ప్రారంభం
– విపక్ష నేతల ముందస్తు అరెస్టు
నవతెలంగాణ – మెదక్‌ ప్రతీయ ప్రతినిధి
దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, కోటి మూడు లక్షల కుటుంబాలకు నల్లా పెట్టి రక్షిత మంచినీళ్లు ఇస్తున్నామని, ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి రోజుకి 24 గంటలు పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, ధాన్యం పండించడంలో నెంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణను నిలిపామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం చర్చి కంపౌండ్‌ మైదానంలో నిర్వహించిన ‘ప్రగతి శంఖారావం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెసోళ్లు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతుండటం విడ్డూరంగా ఉందని, 50 ఏండ్లు ఛాన్స్‌ ఇస్తే తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎలక్షన్‌ సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలని, ఎవరు ప్రజా సేవకులో గుర్తించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే కరువు ప్రాంతాలకు సైతం కృష్ణ, గోదావరి నీళ్లను పారించి పసిడి పంటలు పండించుకునేలా చేశామన్నారు. మెదక్‌ జిల్లాలో ఘనపురం కాలువకు నీళ్లు ఇవ్వాలంటే ఆందోళన చేయాల్సిన దుస్థితి ఉండేదని, తెలంగాణ వచ్చాకనే 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల పాటు కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్‌.. మూడు గంటలు చాలని అంటున్నారని, మరోపక్క బీజేపీ మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నదన్నారు. దుర్మార్గులు, చేతకాని వారికి అధికారం అప్పచెప్పితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. భూముల మీద వీఆర్వోల నుంచి సీసీఎల్‌ అధికారుల వరకు పెత్తనం చెలాయించిన రోజులు పోయాయని, కాంగ్రెస్‌ వాళ్లు మళ్ళీ ఆ పెత్తనాన్ని తీసుకొచ్చేందుకు ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. ధరణిని రద్దు చేయడం అంటే భూములపై రైతులకున్న హక్కు, అధికారాన్ని లేకుండా చేయడమేనని స్పష్టం చేశారు. ధరణి ఉండాలా.. పోవాలా.. అనేది తెలంగాణ రైతాంగం నిర్ణయించుకోవాలన్నారు. వడ్ల పైసలు, రైతుబంధు పైసలు, రైతు బీమా టకాటకామని అకౌంట్లో పడుతున్నాయి అంటే ధరణి సిస్టం ఉండటం వల్లనే సాధ్యమవుతున్నదని తెలిపారు. 37 వేల కోట్ల రుణమాఫీని చేయడం రైతులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. మహారాష్ట్ర రైతులు వీఆర్వో వ్యవస్థను తీసేయాలని బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని కోరుతుంటే.. ఇక్కడున్న కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం ధరణిని రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నూతన భవనాలు, పెంచిన పింఛన్‌ ప్రారంభం
రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు హౌంమంత్రి మహమూద్‌ అలీ, ఆర్‌అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. వికలాంగులకు రూ.3,016 నుంచి రూ.4016 పెంచిన పింఛన్‌ను కొందరు లబ్దిదారులకు పంపిణీ చేస్తూ పథకాన్ని ప్రారంభించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం, నేతల ముందస్తు అరెస్ట్‌
సీఎం కేసీఆర్‌ మెదక్‌ పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశంను, వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మల్లేశం, ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా అధ్యక్షులు కె.ప్రవీణ్‌లను మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి మెదక్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి 2.30 గంటలకు అక్కడి నుంచి పాపన్నపేట్‌ మండలం లక్ష్మినగర్‌ గ్రామంలోని ప్రగతి సెంటర్‌ ఫంక్షన్‌ హాల్‌కు తరలించారు. ఉదయం ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి దినకర్‌ను అరెస్ట్‌ చేశారు.
నేడు మంత్రివర్గ విస్తరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. తాండూరు అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేసిన పట్నం మహేందర్‌ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో పట్నం చేత గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత ఆయన స్థానంలో కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎవ్వరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇప్పుడు రాజకీయ అవసరాల రీత్యా మహేందర్‌ రెడ్డికి బెర్‌ను కేటాయించారు.

Spread the love