కుక్క కరిస్తే … పంటి కాటుకు రూ.10వేల పరిహారం

నవతెలంగాణ హైదరాబాద్: కుక్క కాటు(Dog bite)కు చెప్పుదెబ్బ అన్నది నానుడి. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న శునకాలను పట్టించుకొని ప్రభుత్వాలకు పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది. కుక్కల సైర్యవివార నియంత్రణపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శునకం దాడి సంబంధించిన కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు (High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్‌-హరియాణా హైకోర్టు విచారించింది.
కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం అందించాలని ఆదేశించింది. ‘పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది’ అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో వెలువరించింది. ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది. క్లెయిమ్‌ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని పేర్కొంది.

Spread the love