బీసీలను కించపరిస్తే బుద్ధి చెబుతాం

– టీపీసీసీ చీఫ్‌తోపాటు కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం :
– శాసనమండలి చైర్మెన్‌ , మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని శాసనమండలి చైర్మెన్‌ బండ ప్రకాష్‌ముదిరాజ్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌లు హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కార్యాలయంలో పలువురు బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ముక్త కంఠంతో ఖండించారు. బీసీల్లో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు. కులవత్తులకు అనేక విధాలుగా చేయూతనందిస్తూ వస్తున్నదని వివరించారు. తమ ఎదుగుదలకు అండగా నిలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ వెంట బీసీలు ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేక బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. వారు అధికారంలో ఉన్నంతకాలం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, వారి అభివద్దిని విస్మరించిందని విమర్శించారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటాయని, అయితే ఈ విధమైన వ్యక్తిగత, నోటికొచ్చిన పదాలను వాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక ఆ పార్టీ విధానమా? అనేది కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బీసీ సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. బీసీలను అణిచివేయాలనే లక్ష్యంతో నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, యెగ్గె మల్లేశం, ఎల్‌.రమణ, బస్వరాజ్‌సారయ్య, శంభీపూర్‌రాజు, శాసనసభ్యులు దానంనాగేందర్‌, కాలేరువెంకటేష్‌, ముఠాగోపాల్‌, గంపాగోవర్ధన్‌, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజురవిచంద్ర, బీబీ పాటిల్‌, కార్పొరేషన్‌ చైర్మెన్‌ చింతాప్రభాకర్‌, సీనియర్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌లతో ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Spread the love