బీజేపీ ఎదిగితే బీఆర్‌ఎస్‌ బలాన్ని కోల్పోవడం ఖాయం

బీజేపీ ఎదిగితే బీఆర్‌ఎస్‌ బలాన్ని కోల్పోవడం ఖాయం– నిన్న పక్కనే ఉండి నేడు అక్కసు వెళ్లగక్కుతున్నారు
– మంద కృష్ణ నినాదం, విధానం సరైంది కాదు
– నియోజకవర్గ అభివృద్ధికిఅధికార పార్టీలోకి వెళ్లక తప్పలేదు : స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్‌
రాష్ట్రంలో బీజేపీ బలపడితే బీఆర్‌ఎస్‌ బలాన్ని కోల్పోయి ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి లేకపోలేదని కాంగ్రెస్‌ నేత, స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా దూసుకొస్తున్నదని, అది తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలవారు ఐక్యంగా ఉంటున్నారని, బీజేపీ వల్ల లేని కుల వ్యవస్థ, మతోన్మాదం పెరిగిపోతుందని ఇది రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని అన్నారు. దళితులపై దాడులు చేస్తూ, మహిళలపై హత్యలు మానభంగాలు చేస్తూ, చర్చిలపై దాడులు చేస్తూ తగలబెడుతూ, ముస్లిం మైనారిటీలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్న మంద కృష్ణను కోరేది ఒక్కటేనని, తనపై కోపముంటే ఉండొచ్చుగాక, అంబేద్కర్‌ వాదాన్ని విడిచి, మనువాదాన్ని ప్రోత్సహించవద్దని సూచించారు. మనువాదాన్ని ప్రోత్సహిస్తూ అంబేద్కర్‌ వాదాన్ని తొక్కి పట్టి దళితవాదాన్ని అణిచివేస్తూ, రిజర్వేషన్లను ఎత్తివేసి ఆగం చేయాలని చూస్తున్న బీజేపీని ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించారు. మంద కృష్ణ నినాదం, విధానం సరైంది కాదని, దళిత సమాజం క్షమించదని అన్నారు. తన పక్కనే ఉండి కూడా నేడు ప్రజలకోసం తీసుకున్న నిర్ణయంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఎంపీ అయ్యానని, జనవరి 2017లో కేసీఆర్‌ పిలిచి ఈ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి తన అవసరమని చెబితే డిప్యూటీ సీఎం చేశారని అన్నారు. 2024లో ఏఐసీసీ, పీసీసీ కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించి అవకాశం ఇస్తే వెళ్లానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నీతి, నిజాయితీగా ఉండి సమర్ధుడు అనే పేరు తెచ్చుకున్నానని, అదే పెట్టుబడిగా భావించానని అన్నారు. ఓ వ్యక్తి రెండు నెలల నుంచి పార్టీలో చేర్చుకోమని తిరుగుతున్నాడని, తనని మాత్రం ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే వెళ్ళానని అదే తేడా అని స్పష్టంచేశారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ అంటే గౌరవమని, పార్టీ స్థితిగతులపై పట్టించుకోకపోవడం వల్లే నష్టం జరిగే అవకాశం ఉందని ఆలోచించాలని హితవు పలికారు. తాను చిత్తశుద్ధి, నీతి నిజాయితీగా పనిచేశానని, తనపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు మనువరాలు వయస్సు కలిగిన అభ్యర్థిపై ఓడిపోవడం, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పార్టీలో ఉండి చేస్తున్న తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, ప్రజల చేతుల్లో అవమాన పడిన రసమయి తనకు చావు డప్పు కొడతానని మాట్లాడుతున్న తీరుపై ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా వారి తీరు మార్చుకోకపోతే ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి తన కూతురు కడియం కావ్యను ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఆయన వెంట ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కడియం అభిమానులు, ప్రజా, పార్టీ ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Spread the love