– రైతుల ఆందోళనలపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
– ఏఐకేఎస్ ఖండన
న్యూఢిల్లీ : రైతుల ఆందోళనలపై బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రనాయకత్వం (బీజేపీ) బలంగా లేకుంటే రైతుల ఆందోళనలతో దేశంలో బంగ్లాదేశ్ పరిస్థితులే తలెత్తి ఉండేవని తెలిపారు. కంగనా మాట్లాడుతూ ”బంగ్లాదేశ్‌లో అరాచకం జరిగినట్టే భారతదేశంలోనూ జరిగి ఉండేది. విదేశీ శక్తులు రైతుల సాయంతో మనల్ని నాశనం చేయాలని కుట్ర పన్నాయి. మన నాయకత్వానికి దూరదష్టి లేకుంటే వారు విజయం సాధించి ఉండేవారు” అని అన్నారు.మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుందని రైతులు ఊహించి ఉండరని ఆమె తెలిపారు. ఇప్పటికీ ఆందోళనల పేరుతో వారు సరిహద్దుల్లో కూర్చుంటున్నారని అన్నారు. రైతుల ఆందోళనల కారణంగానే మహిళలపై దాడులు, లైంగికదాడులు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కంగనా వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. పార్టీ విధాన సమస్యలపై బీజేపీ తరపున కంగనా ప్రకటన చేసేందుకు ఎలాంటి అనుమతి లేదా అధికారం లేదని చెప్పి తప్పించుకునేందుకు యత్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయొద్దని కంగనాను ఆదేశించినట్టు సమాచారం. మరోపక్క కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కమలం పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఏఐకేఎస్ ఖండన
రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఖండించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించతగినవని ఏఐకేఎస్ అధ్యక్షులు డా.అశోక్ థావలే తెలిపారు. వ్యవసాయాన్ని కబళించాలనుకునే అంతర్గత -బాహ్య యాజమాన్యాలను మెప్పించేందుకే కంగనా ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఆహార భద్రతను దెబ్బతీసేందుకు ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు, కరోనా మహమ్మారి, ప్రభుత్వాల దౌర్జన్యాల మధ్య రైతుల ఉద్యమం సాగిందని ఏఐకేఎస్ పేర్కొంది. 736 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని తెలిపింది. స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసి బ్రిటీష్ శక్తులకు తలవంచిన పచ్చి మితవాద మత శక్తులకు రైతాంగాన్ని, కార్మిక ప్రజలను ప్రశ్నించే నైతిక అధికారం లేదని థావలే మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలు రైతుల మధ్య విభేదాలను సష్టించే లక్ష్యంతో ఉన్నందున ఈ వ్యాఖ్యలపై బేషరతుగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని అన్నారు.