కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టేది?: కేసీఆర్

నవతెలంగాణ – మానకొండూరు: కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంటే తెలుగుదేశం ఎందుకు పుట్టేదని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు. ట్రాఫిక్ పోలీసులు రోజంతా కాలుష్యంలో గడుపుతారని, దీంతో వారు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటారని, అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా వారి వేతనంలో 30 శాతం అలవెన్స్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఆటోవాళ్లకు శుభవార్త చెబుతున్నానని, వారికి వచ్చే ఆదాయమే తక్కువ అని, కాబట్టి మూడోసారి మన ప్రభుత్వం రాగానే పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికోసారి ఫిట్‌నెస్ చేయించుకోవాలని, ఆ ఫిట్‌నెస్‌కు వెళ్తే రూ.700, సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 ఛార్జ్ చేస్తారని తెలిపారు. ఈసారి బీఆర్ఎస్ గెలిచాక ఈ ఫిట్‌నెస్ ఛార్జీలను రద్దు చేస్తామన్నారు. కరీంనగర్‌కు తనకు ఏదో శ్రుతి ఉందన్నారు. తాను ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని, అలాగే ఇక్కడి నుంచి ఏదో ఒక పథకం ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు ఆటో కార్మికులకు స్కీమ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలందరికీ క్రమంగా అన్నీ చేసుకుంటూ పోతున్నామన్నారు. ఒకనాడు తెలంగాణకు నష్టం చేసిందే కాంగ్రెస్ అని, బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాతో కలిపారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా… బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో అందరూ ఆలోచించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి కిలో బియ్యం రూ.2కు ఇచ్చేవరకు ఆకలి చావులే అన్నారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ ఎందుకు పుట్టేది? అని ప్రశ్నించారు.

Spread the love