అధికారమిస్తే అభివృద్ధి చూపిస్తాం

If given power, we will show development– జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం
– తెలంగాణ ఇచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
– పెద్ద కంపెనీల దోస్తానీతో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది : ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ సభల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా దోచుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. పెద్ద కంపెనీలతో దోస్తానీ చేస్తూ బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో బీజేపీ నేతలు పెద్దలకు రుణమాఫీ చేస్తారు తప్ప రైతులు, కార్మికులకు రుణాలు మాఫీ చేయబోరని అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించాలని.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. ఖానాపూర్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు వెడ్మ బొజ్జు, శ్రీహరిరావు, శ్యాంనాయక్‌, రావి శ్రీనివాస్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ చేసిన మంచి పనులే ఇప్పటికీ ప్రజల మదిలో ఉండేలా చేశాయని గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ అంతే బాధ్యతతో నిర్వర్తించిందన్నారు. ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఆమె మరణించి 40 ఏండ్లు అయినా ఇంకా ఆరాధించడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. జంగ్‌, జంగల్‌, జమీన్‌ సంస్కృతి ఆదివాసీ సంస్కృతి అని, ఇది ప్రపంచంలో అత్యున్నతమైన సంస్కృతి అని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు చూసి ఆనాడు కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదని.. కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.
కేసీఆర్‌, కేటీఆర్‌కు ఉద్యోగాలు ఇవ్వకండి
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. మీరు మాత్రం కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వకూడదని సూచించారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల పేరుతో తొమ్మిదేండ్లుగా ప్రజలను మోసం చేశారన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మాట్లాడలేదని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని, ధరణి పోర్టల్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.
అధికారంలోకి రాగానే రుణమాఫీ
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, రూ.10లక్షల ఇన్సూరెన్సుతో యువవికాసం పథకాన్ని తీసుకొస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మాణం చేపడతామని, కర్నాటక తరహాలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, అభయహస్తం కింద రూ.12లక్షలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, కర్నాటక ఎమ్మెల్సీ ప్రకాష్‌రాథోడ్‌, రాజురా ఎమ్మెల్యే సుభాష్‌దోబే, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love