– కాంగ్రెస్ పాలన చూస్తే.. సమైక్య పాలకులే నయమనిపిస్తోంది
– 420హామీలు అమలు అటకెక్కించి.. ఢిల్లీకి మూటలు జారేస్తున్నరు
– పండవెట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంటనంటూ బెదిరిస్తుర్రు
– ముఖ్యమంత్రిస్థాయి నేత మానవబాంబు అవుతానంటారా?
– క్లీన్ క్యారెక్టర్ ఉన్న వినోద్‌ను పార్లమెంట్‌కు పంపాలి : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
– కరీంనగర్ కదనభేరితో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం
– మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోయిందా?
– ఒకట్రెండ్రోజుల్లో టీవీలకొస్త.. కాళేశ్వరంపై వివరిస్తా
– పార్లమెంట్లో గులాబీ జెండాను ఎగరవేయాలి : కేసీఆర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూస్తే.. నాటి సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. 420 హామీలు ఇచ్చి.. ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి.. నేడు ఢిల్లీకి మూటలు జారేస్తున్నారు. ఆరు గ్యారంటీలు, కరెంటు సంగతి అడిగితే పండవెట్టి తొక్కుత.. పేగులు మెడకేసుకుంటా నంటూ బెదిరిస్తున్నారు.. అసలు ముఖ్యమంత్రి స్థాయి నేత మానవబాంబు అవుతా అంటూ మాట్లాడొచ్చునా?. ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగిన మేడిగడ్డ బరాజ్‌తో దేశమే మునిగిపోయినట్టు రచ్చ చేస్తున్నారు.. దాన్ని సరిచేసి ఎండాకాలంలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కడుపు మాడ్చుతున్నరు. ఒకట్రెండు రోజుల్లో టీవీలకొస్త.. కాళేశ్వరం విలువను వివరిస్తా. పార్లమెంట్లో గులాబీ జెండాను ఎగవేయాలి’ అంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నిక పోరు నేపథ్యంలో కదనభేరి పేరుతో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ వేదికగా ఎస్సాఆర్ఆర్ మైదానంలో మంగళవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ‘రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయ రావట్లేదని అన్నారు. మూడు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతూ రాష్ట్రాన్ని ఆగం చేశారని, ఇదంతా చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోందని తెలిపారు. తెలంగాణలో మొన్న తాను గెలిచి ఉంటే.. దేశాన్ని చైతన్యం చేసేవాన్ని, తాను దిగిపోగానే కరెంట్, రైతుబంధు కట్ అయ్యాయని అన్నారు.
‘ఒక పన్ను వదులైతే మొత్తం పళ్లను రాలగొట్టుకుంటామా? కాళేశ్వరంలో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోంది’ అని రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీల్లోకి వస్తానని, కాళేశ్వరంపై వివరిస్తానని చెప్పారు. మంచినీటి, సాగునీటి సరఫరాలో, కరెంటు సప్లరులో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ‘మేం ఎంతో శ్రమించి ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్ భగీరత పథకం తీసుకొచ్చినం. ఆదిలాబాద్ గోండు గూడెం నుంచి నల్లగొండ లంబాడీతండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసినం. బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివి లేదా..? ఎందుకు మిషన్ భగీరథలో సమస్యలు వస్తున్నరు..?’ అంటూ ప్రశ్నించారు.
నీచంగా ముఖ్యమంత్రి భాష…
ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు అడిగితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, చీరుతా, నరుకుతా, మానవ బాంబు అవుతా అంటున్నారని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో తానూ పరుషంగా మాట్లాడాగానీ, సీఎం అయ్యాక ఏనాడూ అలా మాట్లాడలేదం టూ చెప్పుకొచ్చారు. ‘ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఇయ్యకపోయినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగు, సాగునీటి సరఫరా లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా.. జనం మళ్లీ తమకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు’ అంటూ హెచ్చరించారు.
తమాషాకు ఓటేయొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు. తమాషాకు ఓటేయొద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ సమాజం బాగా ఆలోచించి గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీలను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కదనభేరి సభాధ్యక్షునిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల వ్యవహరించగా.. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి సహా పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.