జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతీ 15 ఏండ్లకు ఈవీఏంలకే రూ. పదివేల కోట్లు

Jamili elections are held every 15 years For EVMs only Rs. Ten thousand crores– రాజ్యంగంలోని ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు
– కేంద్రానికి ఎన్నికల కమిషన్‌ సమాచారం
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు) నిర్వహిస్తే కొత్త ఈవీఎంలు కోసం ప్రతి 15 ఏండ్లకు రూ.పదివేల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఒక సమాచారంలో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంల జీవిత కాలం 15 ఏండ్లు అని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్‌ ఈవీంఎలను మూడు సార్లు ఎన్నికల్లో వినియోగించుకోవచ్చనని తెలిపింది. ఎన్నికల సంఘం అంచనా ప్రకారం ఈ ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం 11.80 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లోనూ రెండు సెట్ల ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రతీ ఈవీఎంకు కంట్రోల్‌ యూనిట్‌, (సీయూ), బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ), ఓటర్‌-వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీపీఏటీ) మెషిన్‌ జత చేయాల్సి ఉంటుంది. అయితే గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లోనూ సీయూ, బీయూ, వీవీపీఏటీలు అదనంగా అవసరమని ఈసీ పేర్కొంది. ఈ వివరాలను జమిలి ఎన్నికలపై కేంద్ర న్యాయ శాఖ పంపిన ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానంలో ఎన్నికల సంఘం తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 45,75,100 బీయూలు, 33,63,300 సీయూలు, 36,62,600 వీవీపీఏటీఎస్‌లు అవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది. 2023 ప్రారంభంలో బీయూ ధర రూ.7,900, సియు ధర రూ. 9,800, వీవీపీఏటీ ధర రూ. 16,000గా ఉంది. ఈవీఎంల ధరతో పాటు పోలింగ్‌, భద్రతా సిబ్బంది కోసం, ఈవీఎంలు దాచి ఉంచడానికి, వాహనాలకు, రవాణాకు అదనంగా మరింత వ్యయం అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే అన్ని అనుకూలంగా ఉన్నా 2029లో మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అలాగే జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంటుందని కూడా ఎన్నికల కమిషన్‌ కేంద్రానికి తెలిపింది. పార్లమెంటు సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 83, లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్‌ 85, రాష్ట్ర శాసనసభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 172, రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్‌ 356కు సవరణ చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో కూడా కొన్ని అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

Spread the love