సంసారాన్ని ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచినా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంత వరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. అందుకే జీవిత భాగస్వామితో సంతోషంగా మన బంధం సాగాలనుకుంటే కచ్చితంగా ఇద్దరికీ తగ్గే ధోరణి అలవడి ఉండాలట. గొడవ ఏదైనప్పటికీ ఏదొక సమయంలో ఎవరో ఒకరు ఒక మెట్టు దిగి ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని, ‘క్షమాపణ’ అనే చిన్న పదం బంధాన్ని బలపరుస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొన్ని వందల జంటలపై సాగించిన అధ్యయనంలో వారికి వచ్చిన ఆరోపణల్లో మొదటి స్థానంలో ఈ ‘సారీ’ చెప్పకపోవడమే నిలిచిందట. అందుకే వారు కొన్ని సూచనలిస్తున్నారు.
అవేంటంటే…
మనసుకైన గాయం చిన్నదైనా, పెద్దదైనా ఎదుటివ్యక్తి దానికి ‘సారీ’ చెప్పకపోతే దానిని తమపై ప్రేమ లేనట్లుగానే భావిస్తారట. భార్య అయినా భర్త అయినా.. నిర్లక్ష్యం, ప్రేమ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, ఇలా ఆ ఫీలింగ్‌కి రకరకాల మాస్కులు తొడిగేసి బాధ పడిపోతారట. ఇక ఆ భావనలు మనసుని పట్టి కుదిపేస్తుంటే అనుబంధం బీటలు వారక ఏమవుతుంది చెప్పండి?
క్షమాపణ కోరడం…
చిన్న సారీ పెద్ద ఉపద్రవాలని ఆపేయ్యగలదు అంటున్నారు పరిశోధకులు. చిన్న చిన్న మనస్పర్ధలు ఒకటొకటిగా చేరి మనసును విరిచేస్తాయట. కాబట్టి ఎదుటి వ్యక్తి మనసు నొప్పిస్తే సిన్సియర్‌గా సారీ చెప్పండి.. బంధాన్ని కాపాడుకోండి అని సలహా ఇస్తున్నారు. కాస్త ఇగో పక్కన పెట్టి సారీ చెప్పేయడం ప్రారంభించండి.
ఎక్కడివక్కడే…
కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మనం పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే… మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది. అంతేకాదు, చాలామంది చేసే పొరపాటు.. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. అలా కాకుండా ఇంటి గుమ్మం తొక్కే ముందే బయటి సమస్యలను బయటనే వదిలేసి ఇంట్లోకి అడుగుపెడితే సగం గొడవలు ఉండవట. అందుకే ఎక్కడి ఆలోచనలు అక్కడే వదిలేయాలని సూచిస్తున్నారు పెద్దలు.
ఆ బంధాలు వద్దే వద్దు..
జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ స్నేహం సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుంటున్నారనో, మీ బంధం హద్దులు మీరడం లేదనో అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిస్థితిని దాటుకుని మొండిగా సాగే స్నేహం సంసారం చీలిపోయేందుకు దారితీస్తుంది. అందువల్ల అటువంటి బంధాలకు ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కుటుంబ సమస్యలు పెరిగేదాక తీసుకురావద్దు.