నా సంఘీభావం ప్ర‌క‌టించానంతే..

ఇటీవల ముగిసిన కేన్స్‌ వారి 77వ ఎడిషన్‌లో చిత్రనిర్మాత పాయల్‌ కపాడియా 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' గ్రాండ్‌ ప్రిక్స్‌ను గెలుచుకున్న విషయంకని కస్రుతి… తన రాజకీయ ఆలోచనలకు, మతసామరస్యానికి భిన్నంగా వుందని కేరళ స్టోరీలో నటించేందుకు తిరస్కరించారు. ఇటీవలే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును గెలుచుకున్న ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ప్రధాన పాత్ర పోషించారు. ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్లో పుచ్చకాయ బ్యాగ్‌ ధరించి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేసినందుకు అనేక విమర్శలకు గురయ్యారు. అయినా నికార్సైన నటిగా సమాజంలో జరిగే ప్రతి అన్యాయంపై తనదైన శైలిలో గొతెంత్తుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఇటీవల ముగిసిన కేన్స్‌ వారి 77వ ఎడిషన్‌లో చిత్రనిర్మాత పాయల్‌ కపాడియా ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ గ్రాండ్‌ ప్రిక్స్‌ను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే 30 ఏండ్ల తర్వాత కేన్స్‌ పోటీలో గెలుపొందిన మొదటి భారతీయ చిత్రం ఇది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఎనిమిది నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ను అందుకుంది. ‘ఇదంతా నమ్మలేకపోతున్నాను. ఇంత లాంగ్‌ స్టాండింగ్‌ ఒవేషన్‌ వస్తుందని ఊహించలేదు. ప్రీమియర్‌ చూసిన తర్వాత ఇతర దేశాల నుండి ఎంతో అనుభవం ఉన్న నటులు నా వద్దకు వచ్చి నా నటనలోని సూక్ష్మ నైపుణ్యాల గురించి నాతో పంచుకున్నారు. వారితో జరిగిన ఈ చర్చలు చాలా విలువైనవిగా భావించాను’ అంటూ కని పంచుకున్నారు.
థియేటర్‌ విద్య పూర్తి చేసి
కని కేరళలోని తిరువనంతపురంలోని చెరువక్కల్‌ గ్రామంలో పుట్టారు. తల్లి జయశ్రీ ఎకె, తండ్రి మైత్రేయ మైత్రేయన్‌. వీరిద్దరూ అభ్యుదయ భావాలు కలిగిన సామాజిక కార్యకర్తలు. అందుకే తమ బిడ్డకు ఇంటి పేరు కానీ, వెనక తల్లిదండ్రుల పేర్లు తోకలుగా వచ్చే సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి కేవలం కని అని పేరు పెట్టుకున్నారు. ఆమె 15 ఏండ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో తప్పని పరిస్థితుల్లో ఆమె పేరు వెనుక కుస్రుతి (మలయాళంలో కొంటె అని అర్థం) అని చేర్చాల్సి వచ్చింది. తిరువునంతపురంలో అభినయ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చెందిన థియేటర్‌ ప్రాక్టీషనర్లకు ఒక సాధారణ వేదిక ఉండేది. ఆమెకు వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 2005 నుండి 2007 వరకు త్రిసూర్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో థియేటర్‌ ఆర్ట్స్‌ ప్రోగ్రామ్‌లో చేరారు. తన థియేటర్‌ విద్యను ఎల్‌కోల్‌ ఇంటర్నేషనల్‌ డి థియేట్రే జాక్వెస్‌ లెకాక్‌లో పూర్తి చేశారు. తర్వాత రెండేండ్ల పాటు ఫిజికల్‌ థియేటర్‌ను పూర్తి చేశారు. తర్వాత నటిగా, మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.
పుచ్చకాయ బ్యాగుతో…
కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో కని ఓ బ్యాగ్‌ పట్టుకున్నారు. అదే పుచ్చకాయ బ్యాగ్‌. పుచ్చాకాయను పోలి ఉన్న బ్యాగ్‌తో ఆమె రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. పుచ్చకాయ ముక్క పాలస్తీనా ప్రతిఘటనకు చిహ్నం. ఆ దేశానికి సంఘీభావంగా ఆమె ఆ బ్యాగ్‌ పట్టుకున్నారు. అయితే దానిపై సోషల్‌ మీడియాలో కాంట్రవర్సీ నడిచింది. ఆమె పాలస్తీనాపై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. దానిపై స్పందిస్తూ ‘అక్కడ చాలామంది చాలా వాటికి సపోర్ట్‌ చేశారు. బ్యాడ్జెస్‌ వేసుకున్నారు. రకరకాల వస్తువులతో తమ సంఘీభావాన్ని తెలిపారు. నేను పాలస్తీనాకి సంఘీభావం తెలపాలి అనుకున్నాను. చాలామంది వర్క్‌ ప్లేసుల్లో మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి, కేన్స్‌లో వర్కర్లకు ఇస్తున్న తక్కువ జీతాల గురించి ఇంకా చాలా విషయాలపై గొంతెత్తారు. నేను పాలస్తీనాకి సంఘీభావం తెలపాలి అనుకున్నాను అంతే. ఒక వ్యక్తిగా నేను కొన్నిసార్లు అనేక ఆలోచనలను పంచుకుంటాను. కొన్ని సమస్యలపై ఎలా నిలబడాలో నిర్ణయించుకుంటాను. విపరీతమైన సంఘటనలు ఏకకాలంలో జరుగుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. నేటి పరిస్థితులు ఎవరికీ అనుకూలంగా లేవు. వీటిని మనం లైట్‌గా తీసుకుంటే కుదరదు. అందుకే నా సంఘీభావం ప్రకటించాను’ అంటూ పంచుకున్నారు.
నాలాంటివారెందరో…
తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ ‘నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలను. జీవనోపాధి కోసమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం ‘బిరియాని’కి కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు, మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నాను. కానీ అంతకు ముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్‌(సజిన్‌ బాబు) నన్ను సంప్రదించారు. స్క్రిప్ట్‌ చదివిన తర్వాత ఈ క్యారెక్టర్‌ చేయలేనని చెప్పా. ఎందుకంటే అది ముస్లింల హక్కుల గురించి మాట్లాడే సినిమా. అయితే నన్ను కలిసిన సజిన్‌ ఓ ముస్లిం. ఇవన్నీ వాస్తవ జీవితాలని నాకు చెప్పారు. అయినా నేను ఒప్పుకోలేదు. అయితే మూడు నెలల తర్వాత చిత్ర నిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో నటిస్తే 70 వేలు ఇస్తామన్నారు. అప్పుడు నా అకౌంట్‌లో మూడు వేలు మాత్రమే ఉన్నాయి. దాంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ఇలా నాలాంటి నటులు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ థియేటర్‌ ఆర్టిస్టుగా నాకు సంపాదన బాగుండి వుంటే సినిమాల్లోకి వచ్చి ఉండేదాన్ని కాదేమో’ అంటూ ఆమె పంచుకున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన కేరళ స్టోరీ చిత్రంలో అవకాశం వస్తే ఆమె దాన్ని సీరియస్‌గా తిరస్కరించారు. తన రాజకీయ ఆలోచనలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఆమె అన్నట్టుగానా ఆ చిత్రం తర్వాత కాలంలో అనేక ప్రాంతాల్లో నిషేధానికి గురయ్యింది.
మదర్‌ థెరిసా పాత్రతో…
థియేటర్‌ ప్రొడక్షన్స్‌ భగవదజ్జుకం, లాస్‌ ఇండాస్‌, హెర్మాన్‌ హెస్సే, సిద్ధార్థ వారి రంగస్థల వేదికలపై నటించారు. ఆమె బర్నింగ్‌ ఫ్లవర్స్‌ – 7 డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌ అనే ఇండో-పోలిష్‌ ప్రొడక్షన్‌లో పరిశోధించి, అభివృద్ధి చేసి నటించారు. ఆంథాలజీ చిత్రం కేరళ కేఫ్‌లో కనిపించిన తర్వాత కనికి నటిగా గుర్తింపు వచ్చింది. తర్వాత శిక్కర్‌, కాక్‌టెయిల్‌ వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈశ్వరన్‌ సాక్షియై అనే మలయాళ ధారావాహికలో మదర్‌ థెరిసా పాత్రతో ప్రజాదరణ పొందారు.
కిందకు దిగేందుకు సిద్ధపడం
థియేటర్‌ నేపథ్యం నుండి రావడంతో సరైన ఎంపికలు చేయడంలో ఆమెకు బాగా సహాయపడింది. ‘ఇది నాకు స్థిరంగా ఉండటంలో, సవాళ్లను ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడంలో సహాయపడింది. థియేటర్‌ నటులుగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకు దిగేందుకు సిద్ధపడం’ అన్నారు. మలయాళ సినిమాకి పునరాగమనం గురించి అడిగితే ఆమె నవ్వుతూ పరిశ్రమలో పాత్రల కోసం ఆడిషన్‌కు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆమె రాబోయే ప్రాజెక్ట్‌లలో రెండు మలయాళ వెబ్‌ సిరీస్‌లు, ఒక మలయాళ చిత్రం, ఒక హిందీ చిత్రంతో పాటు రెండు వెబ్‌ సిరీస్‌ ఉన్నాయి. అలాగే ఒక తమిళ చిత్రం కూడా ఉంది.

Spread the love