– స్థానిక పేద అభ్యర్థులకు మాత్రమే…
– సింగరేణి ఆర్థిక సహకారం
– నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత
– అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌క్యాలెండర్
– ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
– అభ్యర్థులతో ముఖాముఖి
తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై మెయిన్స్‌కు అర్హత సాధించిన తెలంగాణలోని పేద అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ గా నామకరణం చేశారు. రాష్ట్రానికి చెందిన పేద అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ పాసై, మెయిన్స్‌కు ఎంపికై, దేశంలోనే ఉన్నతస్థానాలకు ఎదిగితే అది రాష్ట్రానికి గర్వకారణంగా ఉంటుందన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెంటనే విడుదల చేస్తామన్నారు. శనివారంనాడిక్కడి ప్రజాభవన్‌లో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్స్ అభ్యర్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. తమపార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు. గడచిన పదేండ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందనీ, ప్రశ్నాపత్రాలు లీకయ్యాయనీ, పరీక్షలు రద్దయ్యాయని తెలిపారు. ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారనీ, అలాంటి నిరుద్యోగుల బాధలు తమకు తెలుసని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేశామనీ, యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)లో మార్పులు చేసి, పునర్‌వ్యవస్థీకరించామని వివరించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించామనీ, డీఎస్సీ రాతపరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. పోటీ పరీక్షలను వాయిదా వేయడం మంచిది కాదన్నారు. అయినప్పటికీ నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 రాతపరీక్షలను వాయిదా వేశామన్నారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను తెప్పించుకుంటామనీ, జూన్ రెండులోగా నోటిఫికేషన్లను వేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియను పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నామనీ, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు అక్కడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికైతే తెలంగాణకే మంచి జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ తదితరులు పాల్గొన్నారు.