భర్తకు భార్యా, భార్యకు భర్త… చివరి వరకు ఈ బంధమే తోడుండేది. అయితే చాలా మంది భర్తలు తమ భార్యలను చులకనగా చూస్తారు. ఆమె పక్కన ఉన్నప్పుడు నన్ను వదిలి ఎక్కడకు పోతుందిలే అనే భావనతో ఉంటారు. అదే ఆమె ఒక్కసారి వదిలి వెళ్లిపోతే అప్పుడు ఆమె విలువేంటో తెలుస్తుంది. సాధారణంగా మగవారు భార్య తప్ప ప్రపంచం మొత్తం మనదే అనుకుంటారు. కానీ మహిళలు భర్తే తమ ప్రపంచంగా బతుకుతారు. ఇది భర్తలకు అర్థం కాదు. ‘ఆమె నన్ను ఏమీ చేయలేదు, ఏమన్నా అలా పడుంటుంది’ అనే ఆలోచనే ఉంటుంది. అందుకే ఆమంటే అంత చులకన. ఇలాంటి భర్తను ఆమె మాత్రం ఎన్ని రోజులని భరిస్తుంది. ఓపిక నశిస్తే ఏం చేస్తుందో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్…
రాధికకు సుమారు 32 ఏండ్లు ఉంటాయి. 18 ఏండ్ల కిందట సందీప్‌తో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. రాధిక వాళ్ల పెద్దమ్మకు ముగ్గురు మగపిల్లలు. ఆడపిల్లలు లేకపోవడంతో రాధికను దత్తత తీసుకుంది. అప్పటి నుండి వాళ్ల దగ్గరే పెరిగింది. పెండ్లి కూడా వాళ్లే చేశారు. అయితే ఆమెను పెద్దగా చదివించలేదు. సమాజం అంటే ఏమిటో తెలియకుండా, ఆ ఇల్లే ప్రపంచంగా పెరిగింది.
పెండ్లి చేసినప్పుడు 20 తులాల బంగారం, ఐదు లక్షల కట్నం, కిలో వెండి ఇచ్చి ఘనంగా పెండ్లి చేశారు. సందీప్ బీఎడ్ చేసి టీచర్‌గా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ రాలేదు. అతనికి ఓ తమ్ముడు, ఇద్దరు అక్కలున్నారు. సందీప్‌కి ఉద్యోగం రాకపోవడంతో రాధిక అన్నలు అతనికి పదిహేను లక్షలు ఇచ్చి బంగారం షాపు పెట్టించారు. అది బాగా నడిచింది. సందీప్‌తో పాటు వాళ్ళ తమ్ముడు కూడా షాపులో ఉండేవాడు. లాభాలు కూడా బాగా వచ్చాయి. అతని దగ్గర ఉన్న డబ్బుతో పాటు మరో పది లక్షలు అప్పు చేసి రెండు షాపులు కొన్నాడు. ఆర్థికంగా బాగానే ఉన్నారు.
కానీ రాధికను పెద్దగా పట్టించుకోడు. పెండ్లి అయిన దగ్గర నుండి ‘నీకు చదువు రాదు, ఏమీరాదు. దేనికీ పనికి రావు’ అంటూ అందరి ముందు అవమానించేవాడు. ఆమెను ఓ మనిషిగానే చూడడు. ఎప్పుడూ తిట్టడం, కొట్టడం. రాధికకు సరదాగా బయటకు వెళ్లాలని ఉండేది. పెండ్లయి ఇన్నేండ్లు అవుతున్నా ఒక్కసారి కూడా ఆమెను బయటకు తీసుకెళ్లలేదు. పైగా చాలా బాధపెట్టేవాడు. ఆ బాధలు భరించలేక పుట్టింటికి వెళదామన్నా వెళ్లలేకపోయేది. పెంచిన పెద్దమ్మ వాళ్లు తనకోసం ఎన్నో చేశారు. భర్తను వదిలి వెళితే ఏమనుకుంటారో అని భయం.
కొన్నేండ్లకు సందీప్ తాగుడు, పేకాట, ఐపీఎల్ బెట్టింగ్స్ అంటూ తిరుగుతూ షాపును నిర్లక్ష్యం చేశాడు. దాంతో నష్టాలు వచ్చాయి. అప్పులు పెరిగిపోయాయి. దాంతో రాధిక బంగారం మొత్తం తీసుకెళ్లి అప్పులు తీర్చాడు. అయినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె పెద్దమ్మ వాళ్లే మళ్లీ కొంత సాయం చేసి వెండి వస్తువులు ఇప్పించి వాటితో వ్యాపారం చేసుకోమన్నారు. కానీ సందీప్ అది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. అప్పులు ఇంకా పెరిగిపోయాయి. అతను ఇంత చేసినా రాధిక ఎంతో సహనంగా ఉండేది. అయినా ఆమెను ఏదో ఒకటని బాధపెడుతూనే ఉన్నాడు. సందీప్ అప్పుల్లో కొంత అతని తమ్ముడు తీర్చాడు. దానికి బదులుగా షాపు, కారు తీసుకున్నాడు. ఇవేవీ రాధికకు చెప్పలేదు. ఒకవేళ ఆమె ఏమైనా అడిగినా ‘నీకెందుకు చెప్పాలి’ అంటాడు.
అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి రాధికను బెదిరిస్తున్నారు. సందీప్ ఇవేవీ పట్టించుకోకుండా మద్యానికి బానిసయ్యాడు. రాధిక ఉద్యోగం చేస్తానంటే ‘చదువు రాదు, ఏమీ చేయలేవు, నిన్ను పెండ్లి చేసుకోవడం వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది’ అంటూ తిట్టేవాడు. అతని అక్కలు కూడా రాధికనే నానా మాటలు అనేవారు. శారీరకంగా, మానసికంగా హింసించేవారు. పెద్దమ్మ వాళ్ల దగ్గర డబ్బులు తెచ్చి పిల్లల ఫీజులు కట్టేది. ఇలా ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తినడానికి తిండి కూడా లేదు.
రాధిక తన మెడలోని తాళిపెట్టి ఇంట్లోకి సరుకులు తెచ్చింది. సందీప్ మాత్రం భార్యా పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. రాధిక మూడు నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇరు కుటుంబాల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అప్పుడు అందరూ రాధికనే తప్పు పట్టారు. దాంతో సందీప్ మరింత రెచ్చిపోయాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. పిల్లలు కూడా ఆ మాటలు భరించలేకపోయేవారు. ఎప్పుడూ అసభ్య వీడియోలు చూసేవాడు. వాటి ప్రభావం పిల్లలపై పడుతుందని రాధిక అంటే పెద్ద గొడవ చేసి పంచాయితీ పెట్టించాడు. వీటన్నింటి ప్రభావం రాధిక ఆరోగ్యంపై పడింది. అయినా ఆమెను పట్టించుకోలేదు. పైగా తనను దగ్గరకు రానీయడం లేదంటూ ఊరంత చెప్పుకుంటూ తిరిగేవాడు.
ఈ విషయం గురించి సందీప్ అక్కలు కూడా ఆమెను నిలదీశారు. ఒకపక్క రాధిక నడవలేని స్థితిలో ఉంది. దీని గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు తన 14 ఏండ్ల పాప ‘అమ్మా నువ్వు నాన్నతో ఎందుకు ఉండటం లేదు. నాన్నకు కావల్సింది అదే కదా! ఆయనకు కావల్సింది చేస్తే సరిపోతుంది కదా!’ అన్నది. ఆ మాటలకు రాధిక గుండె పగిలిపోయింది. ‘నా బతుకు ఎందుకు ఇలా అయిపోయింది. భార్యగా కాదు కదా నన్ను ఓ మనిషిగా కూడా చూడడం లేదు. ఇక నేను ఇతనితో బతకలేను’ అని నిర్ణయించుకుంది. పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. ప్రస్తుతం ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలతో ఉంటుంది. ఐద్వా లీగల్‌సెల్ గురించి తెలుసుకొని తనకు విడాకులు ఇప్పించమంటూ వచ్చింది. మేము ఫోన్ చేసి సందీప్‌ను పిలిపించాము. రాధిక చెప్పిన విషయాల గురించి అడిగితే అంతా నిజమే అని ఒప్పుకున్నాడు.
‘నా వల్ల ఆమె ఇంత బాధపడుతుందని అనుకోలేదు. నా కుటుంబం లేకుండా నేను బతకలేను. నా తప్పులు సరి చేసుకుంటాను. ఆమెను నాతో పాటు ఊరికి తీసుకెళతాను పంపించండి’ అన్నాడు. మరి అప్పుల సంగతేంటి అంటే, 50 లక్షల అప్పులు ఉన్నాయి. నేను వాటిని సెటిల్ చేశాను. అప్పులు తీర్చడానికి 10, 15 ఏండ్ల సమయం తీసుకున్నాను. దానికి అందరూ ఒప్పుకున్నారు. ఉద్యోగం కూడా చేస్తాను. నేను తప్ప ఆమెకు ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నాను. మా పెండ్లి జరిగిన ఇన్నేండ్లకు ఆమె ఇలా మొదటి సారి ఇల్లు విడిచి వచ్చేసింది. తను వెళ్లిపోయిన తర్వాతనే తన విలువేంటో తెలిసింది. మీ వల్ల ఆమెను మళ్లీ కలిసే అవకాశం వచ్చింది. ఇక మీదట ఆమెకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను’ అన్నాడు.
రాధిక మాత్రం ‘అతను నన్ను ఓ మనిషిగానే చూడలేదు. తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు తిడతాడు, కొడతాడు. భార్యా, పిల్లలంటే ప్రేమ, బాధ్యత వంటివి ఏమీ లేవు. అలాంటి వ్యక్తితో ఇక నేను బతకలేను. అతనిపై నాకు నమ్మకం లేదు. ఏదో ఒక పని చేసుకొని నా పిల్లల్ని బతికించుకుంటాను. ఆ ధైర్యం నాకు ఉంది. చదువుకున్న వాళ్లు మాత్రమే ఒంటరిగా బతకగలరా! నేను కూడా బతకగలనని నిరూపించుకుంటాను. దయచేసి నాకు అతనితో విడాకులు ఇప్పించండీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మేము ఇద్దరికీ ఆరు నెలల సమయం ఇచ్చాము. సందీప్‌తో ‘నిజంగా మీ భార్యపై ప్రేమ వుంటే బాధ్యతగా ఉండండి. ఆమెకు మీపై నమ్మకం వస్తే అప్పుడు ఆమే మీతో వస్తుంది. ఇష్టం లేకుండా ఇప్పుడు బలవంతంగా మీతో పంపించలేము’ అన్నాము. రాధికతో ‘ఆరు నెలలు సమయం ఉంది కాబట్టి బాగా ఆలోచించుకోండి. కోర్టులో విడాకులు కూడా అంత తొందరగా రావు. అతను మారతానంటున్నాడు. అతనిపై మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే అతనితో వెళ్లొచ్చు. లేదంటే మీ బతుకు మీరు బతకండి. మీకు మా సహకారం ఉంటుంది’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051