– దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో 72 గంటల సమ్మె
– సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
నవతెలంగాణ-గోదావరిఖని
అమలైన 11వ వేతన ఒప్పందాన్ని అడ్డుకుంటే దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో 72 గంటల సమ్మె తప్పదని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 11వ గనిలో మంగళవారం ఫిట్ సెక్రెటరీ అన్నం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కక్షతోనే డీపీఈ నిబంధనలను రూపొందించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని ఆధారంగానే అధికారుల సంఘం కోర్టుకు వెళ్లిందన్నారు. బొగ్గు గని కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వేతన ఒప్పందంపై వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిపి వేతనాల చిచ్చుకు కారణమైన డీపీఈ నిబంధనలను ఎత్తేయాలన్నారు. లేదంటే అక్టోబర్ 5, 6, 7, తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులు సొంతింటి కలపై కార్మిక సమస్యలపై శాసనసభలో మాట్లాడకుండా తమ గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. కార్మికుల వేతనాలపై అధికారులు కోర్టుకు వెళ్లిన విషయంపై, కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తప్పనిసరి చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం జరిగిన సమావేశంలో డైరెక్టర్ అన్ని యూనియన్లను సమానంగా గుర్తిస్తూ సర్క్యులర్ జారీ చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జేల్లా గజేంద్ర, ఉపాధ్యక్షుడు అసరీ మహేష్, ఆరేపల్లి రాజమౌళి, బొద్దుల రఘువరన్, అన్నం శ్రీనివాస్, బొగ్గరం శ్రీనివాసరావు, ఇప్పలపల్లి సతీష్ కుమార్, సీహెచ్ దేవేంద్ర, జె మల్లేష్, యం రామన్న, గాండ్ల రమేష్, జె.సత్యనారాయణరావు, మహేందర్, రవితేజ, కార్మికులు పాల్గొన్నారు.