అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే..

Anganwadis If the demands are not resolved..–  ప్రభుత్వం పతనం తప్పదు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్‌
– అక్రమ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు : కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
– కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం పతనం తప్పదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మె దీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని వెంకటేష్‌ సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీ సమ్మెపై ప్రభుత్వం విధానం మారాలని, సమస్యలను పరిష్కారం చేసి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకలి మంటలతో చెలరేగే ఉద్యమాలను అక్రమ నిర్బంధాలతో ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మె తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, శనివారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్రమంగా సీఐటీయూ నాయకులతో పాటు అంగన్‌వాడీ టీచర్లను, హెల్పర్లను పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా ఆమనగల్‌ పట్టణంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. యాచారంలో భారీ ర్యాలీ నిర్వహించి ముఖ్య కూడలిలో మానవహారం నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట, కొడంగల్‌లో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. పరిగిలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తాండూర్‌లో తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Spread the love