ఉపాధి హమీ చట్టాన్ని ఎత్తేస్తే ఊరుకోం..

– బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటం ఖాయం..
– పేదోళ్ల హక్కుకు ఎసరు పెడుతూ అమృతోత్సవాలా?
– నిర్వీర్యం చేసేందుకే నిధుల కోత..
– ఉపాధి హామీతో ఆత్మగౌరవం పెరిగింది
– దాన్ని దెబ్బతీస్తే ఉద్యమమే..
– జూన్‌ 5 న కలెక్టరేట్ల ముట్టడి : రాష్ట్ర సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తక్షణం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఆపాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించటం ఖాయం’ అని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న కష్టజీవుల ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అమృతోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలనీ, పట్డణ పేదలకు కూడా ఉపాది హామీ పనిని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, డీబీఎప్‌, పీఎంసీ, డీబీఎస్‌యూ, టీవీవీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అ ధ్యక్షులు జి నాగయ్య, బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌ బాలమల్లేశ్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పిశంకర్‌, టీవీవీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటయ్య, పీఎంసీ కన్వీనర్‌ ఎస్‌ శివలింగం, డీబీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి నర్సింహల అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి గోపాల్‌రావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం పేదలకు వరంలాంటిదని చెప్పారు. ఎన్నో పోరాటాలు..ఎందరో త్యాగాలు..రాజు, అరుణ్‌రారులాంటి అధికా రుల శ్రమ, అన్నిటికంటే ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి ఫలితంగానే ఈ చట్టం పురుడు పోసుకుందని గుర్తుచేశారు. నోరులేని పేదలకోసం ఈ చట్టం రూపొందించబడిందనే కనీస ఇంగితం కూడా లేకుండా ప్రభుత్వాలు దీనికి తూట్లు పొడవటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీనిపై బాధ్యత ఉందని నొక్కి చెప్పారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే..రాష్ట్రం చేయాల్సిన పని మరవొద్దని చెప్పారు. ఈ చట్టమే లేకపోతే..ఆకలి చావులు సంభవించేయనీ, వలసలు పెరిగేవని చెప్పారు. అది కేంద్రమైనా..రాష్ట్రమైనా ప్రజల హక్కుల్ని పోరాడి రక్షించుకోవాలన్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపర్చేలా ఒత్తిడి తేవాలని సూచించారు.
మోడీకి ఉపాధి కూలీలు గుర్తుకు రారా?
అఖిల భారత వ్వవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ మోడీకి అదాని, అంబానీలపై ఉన్న ప్రేమ, ఉపాధి హామీ కూలీలపై లేదన్నారు. ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనలో ..దేశాభి వృద్ధిపై బాగా ఊదరగొట్టారని గుర్తుచేశారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి అయినట్లేనా? అని ప్రశ్నిం చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధి కూలీలకు చెందిన సుమారు లక్షా 52 వేల కోట్లకు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నిధులను తిరిగి పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. సర్కారు అంతు తేలుస్తామంటూ మోడీని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా 20కోట్ల మంది దళితులు, 18కోట్ల మంది గిరిజనులు ఉపాధి హామీ పనివల్ల ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పారు.దీన్ని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతుందన్నారు. అందుకే క్రమంగా ఈ చట్టానికి పాడె కట్టేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే పనిదినాలను తగ్గిస్తుందనీ, నిధుల కోతను విధిస్తుందని చెప్పారు.దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 716 జిల్లాలు, 7,168 బ్లాకులు,2,69,453 గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే రూపంలో జరిగే పని ఇదొక్కటేనని గుర్తు చేశారు. ఆరు కోట్ల 77 లక్షల కుటుంబాలకు చెందిన 15కోట్ల 78లక్షల మంది జాబ్‌ కార్డులు కలిగి ఉన్నారన్నారు. ఈ జాబ్‌కార్డులలో 32కోట్ల మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. వారికి పని కల్పించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న దని విమర్శించారు. 50శాతం మంది కూలీలకు కూడా పని కల్పించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని చెప్పారు.
ఏం చేసినా చెల్లుతుందన్న అహం..
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మోడీ ఏం చేసినా చెల్లుతుందన్న అహంభావంతో ఉన్నారని విమర్శించారు. ఉపాధి హామీ కూలీల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. ఈ పథకాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నిస్తే..ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్ల వచ్చిన ఈ చట్టాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాష మాట్లాడుతూ వామపక్షాలు, ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు, మేధావులు ఐక్యంగా యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారంటీ చేస్తూ పార్లమెంట్‌ ఆమోదించిందని చెప్పారు. చట్టాన్ని నీరు గార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌ మాట్లాడుతూ కూలీలు చేసిన పనికి వారం రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు ఆరు నెలలైనా చెల్లించకుండా శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. సమ్మర్‌ అలవెన్స్‌ చెల్లించడం లేదన్నారు. పట్టణాల్లోని గృహ కార్మికులు, చెత్త కార్మికులు భవన నిర్మణా కార్మికులకు పని దొరక్క పస్తులుంటున్నారని తెలిపారు. అందుకే పట్టణ పేదలకు కూడా ఉపాది హామీ పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. పీఎంసీ జాతీయ కన్వీనర్‌ బోస్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టమొచ్చి 17ఏండ్లయిందనీ, దీన్ని సక్రమంగా అమలు చేయాలంటూ డిమాండ్‌ చేయాల్సి రావటం బాధాకరమని అన్నారు. అమృతకాలంలో ప్రవేశించామని అర్థిక మంత్రి చెబుతుంటే..ఏదో అనుకున్నామనీ, ఇలా ఉపాధి పనిని నీరు గార్చడమేనన్నది అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్‌.వెంకట్రాములు సదస్సులో తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం వచ్చే నెల 5న కలెక్టరేట్లను ముట్టడించనున్నట్ట్టు తెలిపారు. కొలతలో సంబంధం లేకుండా చట్ట ప్రకారం కూలి రూ. 272 చెల్లించాలన్నారు. రోజు కూలిని రూ.600లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రెండు సార్లు ఫొటోలను అప్‌లోడ్‌ చేసే పద్దతిని రద్దు చేయాలన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనీ, పనిముట్లు, ఆటో చార్జీలు, సమ్మర్‌ అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పని చూపని దగ్గర జాబ్‌కార్డుదారులకు చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.2.64లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాదిరిగా పట్టణ పేదలకు ఉపాధి పనులు చేపట్టాలని కోరారు. బీకేఎంయూ జాతీయ నాయకులు టి వెంకట్రాములు మాట్లాడుతూ ఎన్‌డిఏ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదన్నారు.
పని అమలవుతున్న గ్రామాలను కొత్తగా నగర పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో కలిపి ఆ పేరుతో కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పని కల్పించటం లేదన్నారు. చేసిన పనికి చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అరకొర ఇస్తున్నారని చెప్పారు. పీఎంసీ రాష్ట్ర కన్వీనర్‌ఎస్‌ శివలింగం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రిప్రసాద్‌, మహిళా కన్వీనర్‌ బి పద్మ, బీకేఎంయూ మహిళా కన్వీనర్‌ కె మహాలక్ష్మి, కె స్వరూప, కృపావేణి, టీవీబీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం వెంకడయ్య, డీబీఎస్‌యూ రాష్ర ప్రధాన కార్యదర్శి జి.నర్సింహ్మ, జాతీయ ప్రజా ఉద్యమాల ఐక్య వేదిక నాయకురాలు మీరా సంఘమిత్ర, బీకేఎంయూ నాయకులు కాంతయ్య, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన తదితరులు పాల్గొన్నారు.

Spread the love