– నిరంతర సేవలో పోలీసులు
– దేశంలోనే రాష్ట్రపోలీస్ నెంబర్‌వన్
– విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజం బాగుండాలంటే నిరంతరం పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే పౌర సమాజం సురక్షితంగా రక్షించబడతారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం పోలీస్ సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీసులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ ప్రాంతాల వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. పోలీసు వాహనాలు సైరన్ మ్రోగిస్తూ దారి పొడుగునా పోలీసులు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ప్రజల నుండి పెద్ద ఎత్తున అభివాదాలు చేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ దారిపొడుగున ప్రజలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హేమచంద్రపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సురక్ష దినోత్సవ వేడుకలలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి అధ్యక్షతన జరిగిన సభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచిందని తెలిపారు. పోలీసులు అనూషమైన రీతిలో బలపడ్డారని, అనేక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నారని, దేశంలోనే తెలంగాణ పోలీసులు, వారి సేవలు, అమోఘంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటేనే ప్రజలు అందరూ సురక్షితంగా ఉంటారన్నారు. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థకు ముఖ్య ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, పోలీసు ఉన్నత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ సురక్షా దినోత్సవ ర్యాలీ
పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవ ర్యాలీ కొత్తగూడెం నుండి పాల్వంచకు చేరుకున్న సందర్భంగా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్‌ల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాహన ర్యాలీలో ఉన్న జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా పోలీస్ సూపర్డెంట్ డాక్టర్ వినీత్‌లకు కొత్వాల జాతీయ పతాకాలను అందజేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లా డుతూ నేరాలు అరికట్ట డంలో పోలీసుల పాత్ర ఎంతో ప్రశంసనీయమని అన్నారు. విధి నిర్వహణలో 24 గంటలు పోలీసులు ప్రజలకు చేరువలో ఉండాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు పాల్గొన్నారు.