నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు సంబంధించిన వేతన సవరణ ఒప్పందం పూర్తి అయినందున, దాన్ని ఉల్లంఘించి ఎవరైనా సమ్మెలోకి వెళ్తే చట్టప్రకారం ‘ఎస్మా’ పరిధిలో చర్యలు తప్పవని కార్మికశాఖ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారంనాడిక్కడి అంజయ్యభవన్‌లో ఆయన సమక్షంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు, యాజమాన్య ప్రతినిధులు 7 శాతం ఫిట్‌మెంట్, ఇతర అలవెన్సులకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం సెక్షన్ 12 (3) ప్రకారం ఈ ఒప్పందం జరిగిందని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆర్టిజన్ల వేతన సవరణపై నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, అందువల్ల దాన్ని ఉల్లంఘించి ఎవరైనా, ఏదైనా సంఘం విద్యుత్ సంస్థల్లో సమ్మెలు చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. యాజమాన్యంతోజరిగిన ఒప్పందంపై 1104, 327, హెచ్-58, 1535 సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు.