నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ టీమ్ ముంబయి ఇండియన్స్ లేకపోతే ప్రపంచ క్రికేట్ లో నేను లేను అని స్టార్ బ్యాట్స్ మెన్ హార్దిక్ పాండ్యా తెలిపారు. ఐపీఎల్ సందడి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ టీమ్‌కు హార్దిక్ పాండ్య సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఆట మొదలు కానున్న తరుణంలో ఓ క్రీడా ఛానల్ ఫ్యాన్ ఈవెంట్‌లో హార్దిక్ మాట్లాడాడు. 2015 ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు ఆడటంతోనే తన ప్రయాణం మొదలైందంటూ పాండ్య ఆ నాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘‘అది (2015) నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం. ఇక్కడే ప్రయాణం మొదలైంది. ఎన్నో ఆశలతో గుజరాత్ నుంచి వచ్చిన ఓ అబ్బాయి కలలు ఆ సమయంలో నెరవేరాయి. ముంబయి ఇండియన్స్ లేకుంటే ప్రపంచ క్రికెట్‌లో ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. మొత్తం సీజన్‌లో ముంబయి జట్టుకు నా వంతు సాకారం అందించా. అదే లీగ్‌లో రెండు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు రావడం ఎప్పటికీ మరచిపోలేను’’ అని పాండ్య తెలిపాడు.