– బీజేపీ సీనియర్ నాయకుడు
– కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడేవారి ప్రాణాలను సైతం తీసేందుకు వెనకాడబోమని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. విజయవర్గియా వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ”భారతదేశాన్ని కీర్తించేవారిని ‘మేము’ అన్నదమ్ములుగా చూస్తాము. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి ప్రాణాలను తీయడానికి వెనకాడం” అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని బాంగ్రోట్ లో పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో మాట్లాడుతూ.. ”మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత్ మాతా కీ జై అని చెప్పే వారందరూ మన సోదరులే. వారి కోసం మనం మన ప్రాణాలను అర్పిస్తాం. కానీ, భారత మాతకు వ్యతిరేకంగా మాట్లాడే వారి ప్రాణాలను కూడా తీయడానికి మేము వెనుకడుగు వేయం” అని విజయ వర్గియా చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై కాంగ్రెస్ ప్రశ్నలతో అవహేళన చేస్తున్నదన్నారు. రాముడు ఒక ఊహాత్మక మూర్తి అని వాదించే వారందరూ తమ పాపాలను పోగొట్టుకోవడానికి జనవరిలో అయోధ్యకు వెళ్లాలని తెలిపారు. విజయవర్గియావి రెచ్చగొట్టే వ్యాఖ్యలనీ, బీజేపీ తన సిద్ధాంతాన్ని ప్రజలకుపై బలవంతంగా రుద్దేప్రయత్నం చేస్తున్నదనడానికి ఈ వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని సామాజికవేత్తలు, మేధావులు తెలిపారు.