సమాజానికి సేవ చేస్తే హీరోలవుతాం

If we serve the society we become heroes– చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమే
– విద్యార్థులకు సీఎం రేవంత్‌ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాజానికి సేవ చేస్తే ప్రజల దృష్టిలో హీరోలవుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమేనని ఆయన దిశా నిర్దేశం చేశారు. అందువల్ల పాఠశాలల్లో విద్యతోపాటు పిల్లలకు సామాజిక అవగాహన కల్పించేందుకు వీలుగా బృంద చర్చలు (గ్రూప్‌ డిస్కషన్స్‌) నిర్వహించాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో పలు సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నేతృత్వంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల తన నివాసంలో సీఎం వారితో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ…చదువుకున్న వారు ప్రయోజకులవుతారని తెలిపారు. అలా ఉన్నత చదువులు చదివి, తెలంగాణ పునర్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సీఎం పిలుపునిచ్చారు. గత పదేండ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఆ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు నిర్ణయించామని గుర్తు చేశారు. స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణనిస్తామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌(ఏటీసీలు)గా మారుస్తున్నాని తెలిపారు. త్వరలోనే స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బడి బయట ఉన్న పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు చొరవ చూపించాలని యువతను కోరారు. ఇది వారిపై ఉన్న అతి పెద్ద బాధ్యతని నొక్కి చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌ లాంటి వ్యసనాల బారిన పడొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటూ నిరుద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేతప్ప రాజకీయ పార్టీల రెచ్చగొట్టుడు ప్రకటనలు చూసి మోసపోవద్దని హితవు పలికారు. తమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలంటూ ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రిని కోరగా… స్థల సేకరణ అనంతరం సొంత భవనాలను నిర్మిస్తామంటూ ఆయన హామీనిచ్చారు.

Spread the love